హోబర్ట్: భారత మహిళా టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన కెరీర్‌లో రెండో ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది. తల్లి అయ్యాక ఆడిన తొలి టోర్నమెంట్‌లోనే ఈ హైదరాబాద్ క్రీడాకారిణి టైటిల్‌ను సొంతం చేసుకొని ఔరా అనిపించింది. శనివారం ముగిసిన హోబర్ట్ ఓపెన్‌లో సానియా (భారత్)–నదియా కిచోనోక్ (ఉక్రెయిన్) జంట చాంపియన్‌గా నిలిచింది. 81 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో సానియా–నదియా ద్వయం 6–4, 6–4తో షుయె పెంగ్–షుయె జాంగ్ (చైనా) జంటను ఓడించింది. 33 ఏళ్ల సానియాకు కెరీర్‌లో ఇది 42వ డబుల్స్ టైటిల్‌కాగా... 27 ఏళ్ల నదియా ఐదో డబుల్స్ టైటిల్‌ను దక్కించుకుంది.
విజేత సానియా–నదియా జంటకు 13,580 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 65 వేలు)తోపాటు 280 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2017లో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ నెగ్గిన తర్వాత సానియా ఖాతాలో చేరిన తొలి టైటిల్ ఇదే. 2017 అక్టోబర్‌లో చైనా ఓపెన్ ఆడిన సానియా ఆ తర్వాత గాయపడటంతో ఆటకు విరామం ఇచి్చంది. 2018 అక్టోబర్‌లో మగబిడ్డ ఇజ్‌హాన్‌కు జన్మనిచ్చిన సానియా 2019 మొత్తం ఆటకు దూరంగా ఉంది. హోబర్ట్ ఓపెన్ టైటిల్‌తో సీజన్‌ను ఆరంభించిన సానియా సోమవారం మొదలయ్యే ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నదియాతోనే కలిసి మహిళల డబుల్స్‌లో బరిలోకి దిగనుంది.
ఇంతకంటే మంచి పునరాగమనాన్ని ఆశించలేదు. నా పిల్లాడు, తల్లిదండ్రులు వెంటరాగా నేను టైటిల్ సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. అత్యున్నతస్థాయిలో మళ్లీ అద్భుతంగా ఆడతానని ఊహించలేదు. టైటిల్ సాధించినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. విజయం సాధించాలంటే ఆటను ఆస్వాదిస్తూ ఆడాలి. నేను అదే చేశా. కొత్త భాగస్వామితో, కొత్త ఏడాదిలో ఆడుతున్నాను కాబట్టి నాపై ఎలాంటి ఒత్తిడి లేదు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగడంతో ఈ టోర్నీ తొలి రౌండ్ మ్యాచ్‌లో ఎలా ఆడతానో, నా ఫిట్‌నెస్ ఎలా ఉంటుందోనని కాస్త కంగారు పడ్డాను. నెల రోజులుగా కాలి పిక్కలో కాస్త నొప్పిగా ఉంది. అయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరో ఆరు నెలల సమయం ఉన్న టోక్యో ఒలింపిక్స్ గురించి ఇప్పుడే ఆలోచించడంలేదు. టోక్యో కంటే ముందు మరో 15 టోర్నమెంట్‌లు ఆడాల్సి ఉంది. వాటి గురించే నేను ఆలోచిస్తున్నాను.
–సానియా మీర్జా
Comments
Please login to add a commentAdd a comment