హోబర్ట్ : రీఎంట్రీలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అదరగొడుతోంది. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టెన్నిస్‌లో పునరాగమనం చేసిన ఈ మాజీ నంబర్ వన్ క్రీడాకారిణి వరుస విజయాలతో దూసుకపోతోంది. హోబర్ట్ ఇంటర్నేషనల్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్ ద్వారా టెన్నిస్‌లో రీఎంట్రీ ఇచ్చిన సానియా వరుస విజయాలతో ఫైనల్‌కు చేరింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్ పోరులో సానియా– నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం 7-6(3), 6-2 తేడాతో టమరా జిదాన్‌సెక్ (స్లోవేనియా)– మేరి బౌజ్‌కోవా (చెక్ రిపబ్లిక్) జోడీపై ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగే ఫైనల్ పోరుకు సిద్దమైంది.
గంటా 24 నిమిషాల పాటు సాగిన సెమీఫైనల్ పోరులో ఆద్యంతం సానియా జోడినే ఆదిపత్యం ప్రదర్శించింది. 15 బ్రేక్ పాయింట్లు సాధించి మ్యాచ్‌పై పట్టు సాధించి విజయం అందుకుంది. ఇక 2017లో చైనా ఓపెన్‌లో చివరి సారి రాకెట్ పట్టిన ఈ సానియా.. రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ అంతర్జాతీయ టెన్నిస్ కోర్టులోకి దిగింది. తల్లి కావడంతో ఇంతకాలం ఆటకు దూరమైన విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిన సానియాకు ఇజహాన్ అనే కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. ఇక రీఎంట్రీ కోసం సానియా తీవ్రంగా కష్టపడింది. దీనికోసం నాలుగు నెలల్లో ఏకంగా 26 కేజీల బరువు తగ్గింది. దీంతో ఆటపై సానియాకు ఉన్న నిబద్దతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment