
కర్ణాటకకు భారీ ఆధిక్యం
రెస్టాఫ్ ఇండియాతో ఇరానీ కప్
బెంగళూరు: రంజీ చాంపియన్ కర్ణాటక ఇరానీ కప్‌లోనూ చెలరేగింది. రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న ఈ ఐదు రోజుల మ్యాచ్‌లో రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికే 189 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. స్టువర్ట్ బిన్నీ (107 బంతుల్లో 115 బ్యాటింగ్; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రెస్టాఫ్ ఇండియా 201 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఓవర్‌నైట్ స్కోరు 35/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన కర్ణాటక 75 పరుగుల వద్ద రాహుల్ (35) వికెట్ కోల్పోయింది. గణేశ్ సతీష్ (180 బంతుల్లో 84; 11 ఫోర్లు), మనీష్ పాండే (47 బంతుల్లో 36; 7 ఫోర్లు) నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ ఇద్దరూ అవుటయ్యాక కరుణ్ నాయర్ (161 బంతుల్లో 92; 12 ఫోర్లు), స్టువర్ట్ బిన్నీ కలిసి ఐదో వికెట్‌కు 187 పరుగులు జోడించి కర్ణాటకు మంచి ఆధిక్యాన్ని అందించారు. ముఖ్యంగా బిన్నీ అద్భుతంగా ఆడి కేవలం 82 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం. నాయర్ 8 పరుగుల తేడాతో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. ఆట ముగిసే సమయానికి బిన్నీతో పాటు గౌతమ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో పంకజ్ సింగ్ రెండు వికెట్లు తీసుకోగా... అశోక్ దిండా, అనురీత్, హర్భజన్ ఒక్కో వికెట్ పడగొట్టారు. మరో మూడు రోజుల ఆట మిగిలున్న నేపథ్యంలో... కర్ణాటక ఈ మ్యాచ్ మీద పట్టుబిగించినట్లే.