‘శాట్స్’ చైర్మన్ ఆకాంక్ష
సాక్షి, హైదరాబాద్: దేశంలో తెలంగాణను క్రీడల్లో నంబర్ 1గా తీర్చిదిద్దేలా కృషిచేయాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి క్రీడాసంఘాలకు పిలుపునిచ్చారు. బంగారు పతకాల తెలంగాణ అయ్యే విధంగా క్రీడాకారులను తయారు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని క్రీడాసంఘాల అధికారులతో ఆయన గురువారం ఎల్బీ స్టేడియంలోని శాట్స్ మీటింగ్ హాల్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రీడా సంఘాలు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. సంఘాలకు రావాల్సిన నిధులు, మౌలిక వసతులు, సదుపాయాల గురించి ఆయన అధికారులతో చర్చించారు.
త్వరలోనే క్రీడా సంఘాల సమస్యల్ని పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. వీటితో పాటు రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం సలహాలను, భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అన్ని సంఘాలు కలిసి కట్టుగా కృషిచేస్తేనే రాష్ట్రంలో క్రీడాభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. క్రీడా సంఘాల ఉమ్మడి లక్ష్యం తెలంగాణను క్రీడల్లో అగ్రస్థానంలో నిలిచేలా పనిచేయడమే కావాలని ఆయన కోరారు. శాట్స్ ఎండీ క్రిస్టినా చొంగ్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని క్రీడా సంఘాల అధికారులు, సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.