
భారీ స్కోరు చేస్తేనే..
ముంబై: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి వన్డేలో తమ జట్టు భారీ పరుగులు చేస్తేనే విజయం సాధ్యపడుతుందని దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అభిప్రాయపడ్డాడు. నాల్గో వన్డేలో గెలిచి మంచి ఊపుమీద ఉన్న టీమిండియాను కట్టడి చేయాలంటే భారీ పరుగులను స్కోరు బోర్డుపై ఉంచాల్సిన అవసరం ఉందన్నాడు. తాము తొలుత బ్యాటింగ్ చేస్తే సాధ్యమైనన్ని ఎక్కువ లక్ష్యాన్ని ప్రత్యర్థి టీమిండియా ముందు ఉంచుతామన్నాడు. ఆదివారం వాంఖేడ్ స్టేడియంలో చివరిదైన ఐదో వన్డే ఇరు జట్లకు కీలకంగా మారడంతో టీమిండియాను కట్టడి చేసేందుకు కసరత్తులు చేస్తున్నామన్నాడు.
'రేపటి వన్డేలో భారీ పరుగులు చేస్తేనే దాన్ని కాపాడుకోవడానికి సాధ్యపడుతుంది. భారీ స్కోరు అనేది ఫలితంపై ప్రభావం చూపుతుంది. ముందు బ్యాటింగ్ చేస్తే మా లక్ష్యం ఎక్కువ పరుగులను స్కోరు బోర్డుపై ఉంచడమే. మేము మంచి క్రికెట్ ఆడితే మ్యాచ్ తో పాటు సిరీస్ ను కూడా గెలుస్తాం' అని ఆమ్లా తెలిపాడు. ఐదో వన్డేకు తమ పేసర్ మోర్నీ మోర్కెల్ అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నాడు. కాలి గాయంతో బాధపడుతున్న మోర్కెల్ తుది వన్డేలో ఆడకపోవచ్చని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. మూడో వన్డేలో 39 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా గెలుపులో ప్రముఖ్ పాత్ర పోషించిన మోర్కెల్ నిర్ణయాత్మక వన్డేలో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నాడు.