సెహ్వాగ్ వారికి క్రికెట్ రుచి చూపించాడు
న్యూఢిల్లీ: ఒకప్పటి భారత్ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ స్టార్స్ని కలిశారు. కుస్తీ యోధులకు సరదాగా కాసేపు క్రికెట్ను చవి చూపించారు. తన ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ లను తీసుకుని సెహ్వాగ్ శుక్రవారం డబ్ల్యుడబ్ల్యుఈ సూపర్ స్టార్ డాల్ఫ్ జిగ్లర్, డబ్ల్యుడబ్ల్యుఈ దివాస్ చాంపియన్ చార్లెట్ను కలిశారు. ఈ సందర్భంగా వీరూ వారికి క్రికెట్ పాఠాలు నేర్పారు. బౌలింగ్ చేయడం, క్యాచ్ పట్టడం, బ్యాటింగ్ లోని మెళకువలను వివరించారు.
వీరంతా కలిసి ఓ చిన్న సైజ్ మ్యాచ్ కూడా ఆడారు. సెహ్వాగ్ తమకు మొదటిసారి క్రికెట్ ఆటను రుచి చూపించారని, ఇది మర్చిపోలేని అనుభూతి అని డాల్ఫ్, చార్లెట్ పేర్కొన్నారు. సెహ్వాగ్ బౌలింగ్ లో బ్యాటింగ్ చేయడాన్ని తాను చాలా ఎంజాయ్ చేశానంటూ డాల్ఫ్ చెప్పారు. కాకపోతే సెహ్వాగ్ బ్యాటింగ్ చేస్తుండగా బాల్ను బౌండరీ దాటకుండా చూసేందుకు తాను చాలా కష్టపడాల్సి వచ్చిందని అన్నారు. సెహ్వాగ్ నిజంగా ఓ అద్భుతమైన క్రికెటర్ అంటూ చార్లెట్ కితాబునిచ్చారు.
శుక్ర, శనివారాల్లో ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో జరుగనున్న 'వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ రోమన్' తోపాటు పలు విభాగాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఈ అమెరికన్ రెజ్లింగ్ స్టార్లను వీరూ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా వీరూ కుమారులు ఆర్యవీర్, వేదాంత్లు తమ ఫేవరెట్ స్టార్లతో ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు.