పార్క్‌వ్యూ ఓపెన్ టోర్నీలో భారత స్క్వాష్ ఆటగాడు వెలవన్ సెంథిల్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించాడు.
చెన్నై: పార్క్‌వ్యూ ఓపెన్ టోర్నీలో భారత స్క్వాష్ ఆటగాడు వెలవన్ సెంథిల్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన సెంథిల్ సెమీస్‌లో 12–10, 11–7, 11–9తో మూడో సీడ్ మార్క్ ఫుల్లర్(ఇంగ్లండ్)పై వరుస సెట్లలో విజయం సాధించాడు. దీంతో తొలిసారి పీఎస్‌ఏ వరల్డ్ టూర్ ఫైనల్‌కు అతడు అర్హత సాధించాడు. అంతకు ముందు జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌లో సెంథిల్ టాప్‌సీడ్ అకీల్ రహమాన్(ఆస్ట్రియా)ను 11–3, 11–1, 11–5తో కంగుతినిపించాడు. మరో సెమీఫైనల్‌లో భారత్‌కే చెందిన రెండో సీడ్ ఆటగాడు హరిందర్‌పాల్ సింగ్ సంధు 8–11, 6–11, 5–11తో ఎల్స్‌హర్‌బిని(ఈజిప్ట్) చేతిలో ఓడిపోయాడు. ఫైనల్స్‌లో ఎల్స్‌హర్‌బిని, సెంథిల్ తలపడతారు.
క్వార్టర్స్‌లో జోష్న ఓటమి
చెన్నై: ప్రపంచ మహిళల స్క్వాష్ చాంపియన్‌షిప్ నుంచి భారత స్టార్ క్రీడాకారిణి జోష్న చినప్ప నిష్క్రమించింది. ఈజిప్ట్‌లోని ఎల్‌గోనలో జరుగుతున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జోష్న 6–11, 12–10, 7–11, 11–8, 3–11తో కమిల్లీ సెర్మి(ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయింది. 70 నిముషాలు జరిగిన ఈ పోరులో కమిల్లీ ముందు నుంచే జోష్నపై విన్నర్లతో దాడి చేసింది. వాటిని తట్టుకుంటూ ఎదురునిలిచినా నిర్ణాయక ఐదో సెట్‌లో 3–11తో ఓడిపోయి జోష్న మ్యాచ్‌ను కోల్పోయింది.