
ఢాకా: వెస్టిండీస్‌తో జరుగుతోన్న రెండో టెస్టులో అరంగేట్ర ఆటగాడు షాద్‌మన్ ఇస్లాం (199 బంతుల్లో 76; 6 ఫోర్లు), కెప్టెన్ షకీబుల్ హసన్ (113 బంతుల్లో 55 బ్యాటింగ్; 1 ఫోర్) అర్ధశతకాలతో మెరిశారు. ఫలితంగా శుక్రవారం తొలిరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 90 ఓవర్లలో 5 వికెట్లకు 259 పరుగులు చేసింది. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ గెలిచిన బంగ్లా ఈ టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ ఆడుతున్న షాద్‌మన్ చక్కటి సంయమనంతో ఆడాడు.
తొలి వికెట్‌కు సౌమ్య సర్కార్ (19)తో కలిసి 42, రెండో వికెట్‌కు మోమినుల్ హఖ్ (29)తో 45, మూడో వికెట్‌కు మొహమ్మద్ మిథున్ (29)తో 64 పరుగులు జతచేశాడు. అనంతరం షాద్‌మన్, ముష్ఫికర్ (14) ఔటైనా... చివర్లో షకీబ్ ఆకట్టుకున్నాడు. మహ్ముదుల్లా (31 బ్యాటింగ్)తో కలిసి అతను ఆరో వికెట్‌కు అజేయంగా 69 పరుగులు జతచేశాడు. విండీస్ బౌలర్లలో బిషూ 2, రోచ్, లెవిస్, చేజ్ తలా ఓ వికెట్ పడగొట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో టెస్టుల్లో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న ముష్ఫికర్...తమీమ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో బంగ్లా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.