ఐపీఎల్ ఫైనల్‌లో గాయాన్ని లెక్కచేయకుండా వీరోచిత ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌పై అన్నివైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. ఇతర జట్ల అభిమానులు కూడా అతడిని మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను వ్యతిరేకించే వారు కూడా వాట్సన్ ఆటకు ఫిదా అయిపోయారు.
‘నేను ముంబై ఇండియన్స్ అభిమానిని. కానీ వాట్సన్ ఆట, అంకితభావం చూశాక అతడిని మెచ్చుకోకుండా ఉండలేకపోయాన’ని ముంబై అభిమాని ఒకరు కామెంట్ చేశారు. ‘నేను రోహిత్ సేన ఫ్యాన్‌ని. రక్తంతో తడిసిన ప్యాడ్స్‌తో ఆడినట్టు వాట్సన్ ఫొటోలు చూసిన తర్వాత విజయానికి అన్నివిధాల అర్హుడని భావించాను. దురదృష్టవశాత్తు విజయాన్ని అందించలేకపోయాడు. ఒక్క విషయం మాత్రం నిజం. తన ఆటతో లక్షలాది మంది హృదయాలను గెల్చుకున్నాడ’ని నిశాంత్ పరిహార్ అనే ముంబై ఇండియన్స్ అభిమాని పేర్కొన్నాడు.
రక్తమోడుతూ వాట్సన్ బ్యాటింగ్ చేయడం చూసి కన్నీరు ఆగలేదని, నోటి వెంట మాటలు రాలేదని మరో అభిమాని వెల్లడించారు. వాట్సన్ వారియర్, లెజెండ్ అని.. ఐపీఎల్ ట్రోఫికి అతడు అన్నివిధాల అర్హుడన్నారు. అతడిపై గౌరవం పెరిగిందన్నాడు.
వాట్సన్‌ను అల్టిమేట్ హీరోగా, సూపర్ హీరోగా సినీ నటి కస్తూరి వర్ణించారు. గాయం బాధను పంటి బిగువున బిగబట్టి ప్రపంచానికి రక్తం రంగును పసుపుగా చూపించాడని ప్రశంసించారు. ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున అతడు ఆడటం గౌరవంగానూ, గర్వంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment