![Shared the 'dare devils' - Sakshi](/styles/webp/s3/article_images/2018/03/10/Untitled-3.jpg.webp?itok=VFW0tm6-)
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2018 సీజన్ ఆరంభానికి నెల రోజుల ముందు ఫ్రాంచైజీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో 50 శాతం వాటాను జిందాల్ సౌత్ వెస్ట్ (జేఎస్‌డబ్ల్యూ) స్పోర్ట్స్ కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని జీఎంఆర్, జేఎల్‌డబ్ల్యూ సంయుక్తంగా ప్రకటించాయి. అయితే ఈ 50–50 ఒప్పందాన్ని బీసీసీఐ అధికారికంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నెల 16న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం లాంఛనమే కావచ్చు.
కొందరు వ్యక్తులు, సంస్థలు కన్సార్టియంగా ఏర్పడి రాజస్థాన్, పంజాబ్, కొచ్చి వంటి ఐపీఎల్ జట్లను కొనుగోలు చేయడం గతంలో జరిగినా... ఒక యాజమాన్యం మరొకరికి తమ జట్టులో వాటా అమ్మడం మాత్రం ఇదే తొలిసారి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఒప్పందానికి ముందు ప్రస్తుతం ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు విలువను రూ. 1100 కోట్లుగా నిర్ధారించారు. జేఎస్‌డబ్ల్యూ ఈ డీల్ కోసం రూ. 550 కోట్లను చెల్లించనుంది. తొలి ఐపీఎల్‌నుంచి పదేళ్ల పాటు లీగ్‌లో ఉన్నా డేర్‌డెవిల్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. 2008లో ఆ జట్టు సెమీఫైనల్ చేరింది. 2012లో మూడో స్థానంలో నిలవడమే ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన.
Comments
Please login to add a commentAdd a comment