ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) మాదిరే మరో ఫ్రాంఛైజీ లీగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) శ్రీకారం చుట్టనుందా?.. వేలం ప్రాతిపదికన ఆటగాళ్లను కొనుగోలు చేసి.. జట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనుందా?.. అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అయితే, ఈ టీ20 లీగ్ రిటైర్ అయిన క్రికెటర్ల కోసమే ప్రత్యేకంగా రూపుదిద్దుకోనుందని సమాచారం.
బీసీసీఐ ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందింది. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో ప్రతిభ నిరూపించుకున్న క్రికెటర్లు.. పేరుప్రఖ్యాతులతో పాటు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. ఇక టీమిండియా వెటరన్లు సైతం ఈ లీగ్ ద్వారా ఇంకా యాక్టివ్ క్రికెటర్లుగా కొనసాగుతూ తమలో సత్తా తగ్గలేదని నిరూపించుకుంటున్నారు.
లెజెండ్స్ స్పెషల్?
అయితే, ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లలో కొందరు లెజెండ్స్ లీగ్ క్రికెట్ వంటి పొట్టి ఫార్మాట్ టోర్నీల ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ వంటి మాజీలు ఇందులో భాగమవుతున్నారు. అయితే, ఇలా ప్రైవేట్ లీగ్‌లలో కాకుండా బీసీసీఐ నేతృత్వంలోని లీగ్‌లో ఆడాలని భారత మాజీ క్రికెటర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షాను కలిసి తమ మనసులో మాటను వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ అధికారి ఒకరు దైనిక్ జాగరణ్‌తో మాట్లాడుతూ.. ‘‘టీ20 లీగ్ నిర్వహణకు సంబంధించి మాజీ క్రికెటర్ల నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ ప్రపోజల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మేము కూడా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.
ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు
బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్‌తో పాటు మహిళా ప్రీమియర్ లీగ్(WPL) కూడా నిర్వహిస్తోంది. ఇక ఈసారి ఐపీఎల్ మెగా వేలం కూడా జరుగబోతోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు లీగ్‌ల నిర్వహణతో పాటు వేలానికి సంబంధించిన పనులతో బీసీసీఐ బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో మాజీ క్రికెటర్లు ప్రతిపాదించినట్లుగా లెజెండ్స్ లీగ్ నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు.
అయితే, భవిష్యత్తులో మాత్రం ఈ లీగ్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా బీసీసీఐతో అన్ని సంబంధాలు తెంచుకున్న క్రికెటర్లు మాత్రమే విదేశీ లీగ్‌లలో ఆడేందుకు అనుమతి ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వదేశీ లీగ్‌తోనే మరోసారి సత్తా చాటాలని మాజీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment