ఐపీఎల్ రిటెన్షన్‌పై విరాట్ కోహ్లి
మరో మూడేళ్లు బెంగళూరుకే ఆడతానని ప్రకటన
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో జట్టు జెర్సీలో తనని తాను ఊహించుకోలేనని భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కే ప్రాతినిధ్యం వహిస్తున్న కోహ్లి... మరో మూడేళ్ల పాటు బెంగళూరుకు ఆడటం ఖాయమే అని సూచనప్రాయంగా చెప్పాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం కాగా... అప్పటి నుంచి కోహ్లి బెంగళూరు జట్టు తరఫునే బరిలోకి దిగుతూ వస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే జట్టుకు ఇన్ని సీజన్‌లు ఆడిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ రికార్డు నెలకొల్పాడు.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు తాజాగా జరిగిన రిటెన్షన్ విధానంలో ఆర్సీబీ యాజమాన్యం రూ. 21 కోట్లకు కోహ్లిని తిరిగి దక్కించుకుంది. 36 ఏళ్ల విరాట్ 2027 వరకు బెంగళూరు జట్టు తరఫున ఆడనున్నట్లు ఆర్సీబీ విడుదల చేసిన ప్రత్యేక వీడియోలో వెల్లడించాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 252 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి... 131.97 స్ట్రయిక్ రేట్, 38.66 సగటుతో 8004 పరుగులు చేశాడు. అందులో 8 సెంచరీలు 55 అర్ధ శతకాలు ఉన్నాయి. తాజా రిటెన్షన్ విధానం మరో మూడేళ్లు కొనసాగనుండగా... అప్పటి వరకు ఆర్సీబీ జట్టులో విరాట్ కీలక పాత్ర పోషించనున్నాడు.
‘ఈ సర్కిల్ ముగిసేసరికి నాకు ఐపీఎల్‌లో 20 ఏళ్లు పూర్తవుతాయి. అప్పటి వరకు ఆర్సీబీతోనే కొనసాగడం చాలా గొప్ప విషయంగా అనిపిస్తోంది. కెరీర్ ఆరంభించిన తొలినాళ్లలో ఇన్నాళ్లు ఆడతానని అనుకోలేదు. కానీ ఫ్రాంచైజీ యాజమాన్యంతో ఉన్న అనుబంధం వల్ల ఈ ప్రయాణం సాగుతోంది. ఒకే జట్టుతో ఇన్నేళ్ల పాటు ఉండటం బాగుంది. ఆర్సీబీతో నా బంధం ఎంత బలమైందంటే... నన్ను నేను వేరే ఐపీఎల్ జెర్సీలో ఊహించుకోలేను. కొత్త సీజన్ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నా. కొత్త జట్టును సిద్ధం చేసేందుకు నేను రెడీగా ఉన్నాను.
జట్టును ముందుకు తీసుకెళ్లడంలో నా వంతు పాత్ర పోషిస్తా. ఐపీఎల్ టైటిల్ సాధించడం మా అందరి లక్ష్యం. వచ్చే మూడేళ్లలో అది సాధ్యమయ్యే దిశగా అడుగులువేస్తా’ అని కోహ్లి వెల్లడించాడు. ఆర్‌సీబీ అభిమానుల గురించి మాట్లాడుతూ కోహ్లి భావోద్వేగానికి గురయ్యాడు. ఒక్కసారి టైటిల్ గెలవకపోయినా...గెలుపోటముల్లో ఎల్లవేళలా మద్దతునిచ్చిన ఫ్యాన్స్‌కు అతను కృతజ్ఞతలు తెలిపాడు. ‘ప్రపంచంలో ఏ జట్టుకు లేనంత మంది అభిమానులు అర్సీబీకి ఉన్నారు. వారితో విడదీయలేని అనుబంధం ఉంది. ఆర్సీబీ అంటే నేను అనే విధంగా అభిమానులు చూపే ఆదరణకు ముగ్దుడిని అయ్యాను.
ఇన్నేళ్లలోనే నేను సంపాదించుకున్న అతి విలువైనది అభిమానుల మనసు గెలవడమే. రోజు రోజుకు నాకు, అభిమానులకు మధ్య బంధం బలపడుతూ వస్తోంది. ఆర్సీబీ తరఫున బరిలోకి దిగిన ప్రతిసారి ప్రేక్షకుల అరుపులు నాకు మరింత ఉత్సాహాన్నిస్తాయి. అదే కొత్త జోష్‌లాగా ఉంటుంది. తదుపరి దశలో ఏం చేయగలననే దానిపైనే దృష్టి పెడుతున్నా.నా వరకు బరిలోకి దిగిన ప్రతిసారి వంద శాతం కష్ట పడేందుకు ప్రయత్నిస్తా. ఫలితం మన చేతిలో ఉండదు. అభిమానులు గర్వపడే ప్రదర్శన చేయడమే నా కర్తవ్యం. మైదానంలో అభిమానులు నా పేరు, ఫ్రాంచైజీ పేరుతో గోల చేయడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తా’ అని విరాట్ వీడియోలో వివరించాడు.
విరాట్ వెన్నెముక: ఆండీ ఫ్లవర్
ఇక బెంగళూరు హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ మాట్లాడుతూ... రిటెన్షన్ విధానంలో సరైన ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించాడు. ఆర్సీబీకి విరాట్ వెన్నెముక లాంటి ఆటగాడని ఆండీ ఫ్లవర్ పేర్కొన్నాడు. ‘విరాట్ కోహ్లిని రీటైన్ చేసుకోవడం నన్నే కాదు... దేశంలో ఏ ఒక్కరినీ ఆశ్చర్య పరచలేదు. అతడు చాన్నాళ్లుగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. బెంగళూరు ఫ్రాంచైజీ విజయవంతం కావడానికి విరాట్ ప్రధాన కారణం. గత సీజన్‌లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు.
లీగ్ తొలి అర్ధ భాగంలో జట్టు ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా... అతడి ఆటతీరుకు వంక పెట్టలేం. ఆ తర్వాత తిరిగి గాడిన పడిందంటే అది కూడా విరాట్ వల్లే’ అని ఆండీ ఫ్లవర్ అన్నాడు. ఐపీఎల్ రిటెన్షన్ గడువు ముగియగా... బెంగళూరు జట్టు ముగ్గురు ఆటగాళ్లను మాత్రమే అట్టి పెట్టుకుంది. రూ. 21 కోట్లు పెట్టి విరాట్‌ను తిరిగి తీసుకున్న ఆర్సీబీ దూకుడైన బ్యాటర్ రజత్ పటిదార్‌కు రూ. 11 కోట్లు, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ యశ్ దయాళ్‌కు రూ. 5 కోట్లు కేటాయించింది. ఆటగాళ్లను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కో జట్టుకు అత్యధికంగా రూ. 120 కోట్లు కేటాయించగా... అందులో బెంగళూరు ఫ్రాంచైజీ 37 కోట్లు ఖర్చు పెట్టింది.
వేలం కోసం ఆర్సీబీ వద్ద రూ. 83 కోట్లు మిగిలాయి. ఈ నెలాఖరున జరిగే ఐపీఎల్ వేలంలో బెంగళూరు ఎలాంటి జట్టును ఎంపిక చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ముగ్గురు క్యాప్డ్ ప్లేయర్లను ఆర్టీఎమ్ ద్వారా తిరిగి దక్కించుకునే అవకాశం బెంగళూరుకు ఉండగా... ఇప్పటి వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్, ఆ్రస్టేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్, హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌ను అట్టి పెట్టుకోకుండా విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment