ఆ మెరుపుల వెనుక కోహ్లి సలహా!
ముంబై: ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తరఫున మెరుపులు మెరిపిస్తున్న యువ బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ తాను బ్యాటింగ్‌లో మెరుగుపడటానికి కెప్టెన్ విరాట్ కోహ్లి సలహాలే కారణమని తెలిపాడు. మ్యాచ్ పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్ చేయాల్సిందిగా బెంగళూరు కెప్టెన్ కోహ్లి తనకు సూచించాడని చెప్పాడు.
హైదరాబాద్ సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 35 పరుగులు చేసి సర్ఫరాజ్ శెభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే. గురువారం ముంబై ఇండియన్స్‌తో ఐపీఎల్ మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సర్ఫరాజ్ బుధవారం మీడియాతో మాట్లాడాడు. 'గడిచిన ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. మా జట్టు (బెంగళూరు)లోకి కొత్తగా షేన్ వాట్సన్ లాంటి అనుభవజ్ఞుడు రావడం ఎంతో నాకు మేలు చేసింది. అనుభవపరంగానూ ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను' అని తెలిపాడు.
'గత ఏడాది ఐపీఎల్‌లో కొన్ని తప్పులు చేశాను. గత ఏడాది చేసిన తప్పులు ఈసారి పునరావృతం కాకుండా చూసుకుంటున్నాను. జట్టు సభ్యులు నాలో ఆత్మవిశ్వాసాన్ని పోద్రి చేస్తున్నారు. ప్రతి మ్యాచ్ తొలి మ్యాచ్ అని భావించి ఆడామని, జట్టు అవసరాలకు అనుగుణంగా బ్యాటింగ్ చేయమని నన్ను ప్రోత్సహిస్తున్నారు' అని సర్ఫరాజ్ చెప్పాడు. ముంబైతో మ్యాచ్‌లో తాను రాణించేందుకు ప్రయత్నిస్తానని, అయితే, తమ జట్టు టాప్ ఆర్డర్ అయిన విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ ఫామ్‌లో ఉండటంతో బ్యాటింగ్ తనవరకు వచ్చే అవకాశాలు తక్కువని చెప్పాడు.