కోచ్గా అతని ఎంపిక లాంఛనమేనా?
ముంబై: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లితో పొసగక అనిల్ కుంబ్లే రాజీనామా చేయడం.. ఒక ఫ్రెండ్లీ కోచ్ కావాలని కోహ్లి చెప్పడం.. ఆ మేరకు బీసీసీఐ రెండోసారి దరఖాస్తులు ఆహ్వానించడం.. ఇక కోచ్ గా రానంటూనే అప్పటివరకూ భీష్మించుకుని కూర్చొన్న రవిశాస్త్రి ఒక్కసారిగా దరఖాస్తు చేయడం.. అందుకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వెనుక ఉండటం.. ఇవన్నీ గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు. దీన్ని బట్టి చూస్తుంటే రవిశాస్త్రి ప్రధాన కోచ్ గా ఎంపిక కావడం లాంఛనంగా కనబడుతోంది.
సోమవారం(జూలై 10)వ తేదీన టీమిండియా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం సెలక్షన్ జరుగుతున్న క్రమంలో రవిశాస్త్రి మరోసారి వార్తల్లోకి వచ్చాడు. గతంలో టీమిండియా డైరెక్టర్గా పని చేసిన అనుభవం ఉన్న రవిశాస్త్రి కోచ్ అభ్యర్ధుల్లో టాప్ ప్లేస్లో ఉన్నాడు. మొత్తంగా చూస్తే రవిశాస్త్రితో పాటు సెహ్వాగ్, టామ్ మూడీ, రిచర్డ్ పైబస్, దొడ్డ గణేష్, లాల్ చంద్ రాజ్పుత్, లాన్స్ క్లూసెనర్, రాకేశ్ శర్మ, సిమన్స్, ఉపేంద్ర నాథ్ బ్రహ్మాచారిల నుంచి బీసీసీఐకి దరఖాస్తులు అందగా, స్క్రూట్నీ తరువాత రేసులో నిలిచింది మాత్రం ఆరుగురు మాత్రమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానంగా శాస్త్రితో పాటు సెహ్వాగ్, మూడీ, సిమన్స్, పైబస్, రాజ్పుత్లను మాత్రమే బీసీసీఐ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) ఇంటర్య్యూ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంచితే, కుంబ్లే రాజీనామా తరువాత ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సైతం రవిశాస్త్రి వైపు మొగ్గుచూపాడు. కోహ్లి సేనను కుంబ్లే కంటే కూడా రవి బాగా నడిపించగలడని చెప్పడం అతని ఎంపిక లాంఛనమనే అభిప్రాయం కలుగుతోంది. ఇక రవిశాస్త్రి టీమిండియా డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఆసీస్ పర్యటనలో టీ 20 సిరీస్ ను తొలిసారి గెలిచింది. రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత జట్టు నంబర్ వన్ ర్యాంకును దక్కించుకుంది. 2015 వరల్డ్ కప్ లో సెమీస్ వరకూ చేరడంలో కూడా రవిశాస్త్రి పాత్ర ఉంది. మరొకవైపు ఆటగాళ్ల పట్ల 'హెడ్ మాస్టర్' లా వ్యవహరించకుండా తగిన స్వేచ్ఛనివ్వడం కూడా రవికి కలిసొచ్చే అంశం. ఏమైనా అద్భుతాలు జరిగితే తప్పితే రవిశాస్త్రి కోచ్ కావడం ఖాయంగా కనబడుతోంది. ఇప్పటికే విండీస్ పర్యటనలో ఉన్న భారత ఆటగాళ్లు కూడా రవికే ఓటేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కోచ్ ఎంపికకు సంబంధించి విండీస్ పర్యటనలో ఉన్న విరాట్ సేననుబీసీసీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) రాహుల్ జోహ్రి అభిప్రాయం కోరగా, అక్కడ రవికే మనోళ్లు ఓటేసినట్లు తెలుస్తోంది.