సెరెన 'సేఫ్'... నాదల్ కు షాక్ | Shock to nadal and sarena is in safe | Sakshi
Sakshi News home page

సెరెన 'సేఫ్'... నాదల్ కు షాక్

Published Sun, Sep 6 2015 12:32 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM

సెరెన 'సేఫ్'... నాదల్ కు షాక్

సెరెన 'సేఫ్'... నాదల్ కు షాక్

♦ చెమటోడ్చి నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్  
♦ స్పెయిన్ స్టార్‌కు ఊహించని ఓటమి  
♦ యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ
 
 కాస్త అటు ఇటు అయితే అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్ ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ కల చెదిరేది. కానీ మంచి ప్లేయర్‌కు, గొప్ప ప్లేయర్‌కు మధ్య ఉండే తేడాను చూపిస్తూ కీలక దశలో చెలరేగిన ఈ డిఫెండింగ్ చాంపియన్ ఓటమి నుంచి గట్టెక్కి విజయతీరాలకు చేరింది. మరోవైపు స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ ఈ ఏడాది తన ఖాతాలో ఎలాంటి ‘గ్రాండ్‌స్లామ్’ టైటిల్‌ను చేర్చుకోకుండానే ముగించాడు. తన గ్రాండ్‌స్లామ్ కెరీర్‌లో నాదల్ తొలి రెండు సెట్‌లు నెగ్గిన తర్వాత వరుసగా మూడు సెట్‌లు కోల్పోయి ఓటమిని మూటగట్టుకోవడం  ఇదే తొలిసారి.
 
 న్యూయార్క్ : గొప్ప పోరాటపటిమను కనబరిచిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘క్యాలెండర్ గ్రాండ్‌స్లామ్’ ఘనత సాధించే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో సెరెనా 3-6, 7-5, 6-0తో బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)పై విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. తొలి సెట్‌ను కోల్పోయిన ఈ డిఫెండింగ్ చాంపియన్ రెండో సెట్‌లో 3-5తో వెనుకబడింది. తొమ్మిదో గేమ్‌లో గనుక బెథానీ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని ఉంటే సెరెనా ఓటమి పాలయ్యేది.

కానీ సెరెనా ఏమాత్రం బెదరకుండా, తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. తొమ్మిదో గేమ్‌లో బెథానీ సర్వీస్‌ను బ్రేక్ చేయడంతోపాటు పదో గేమ్‌లో తన సర్వీస్‌ను కాపాడుకొని స్కోరును 5-5తో సమం చేసింది. ఆ తర్వాత మరోసారి బెథానీ సర్వీస్‌ను బ్రేక్ చేసి, తన సర్వీస్‌ను కాపాడుకొని రెండో సెట్‌ను 7-5తో సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచింది. నిర్ణాయక మూడో సెట్‌లో సెరెనా తన విశ్వరూపాన్ని చూపించడంతో బెథానీ చేతులెత్తేసింది.

తన ప్రత్యర్థికి ఒక్క గేమ్ కూడా ఇవ్వకుండా సెరెనా మూడో సెట్‌ను 6-0తో సొంతం చేసుకొని మ్యాచ్‌కు అద్వితీయ ముగింపునిచ్చింది. గంటా 49 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా ఏడు ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో అమెరికాకే చెందిన రైజింగ్ స్టార్ మాడిసన్ కీస్‌తో సెరెనా అమీతుమీ తేల్చుకుంటుంది. మూడో రౌండ్‌లో 19వ సీడ్ మాడిసన్ కీస్ 6-3, 6-2తో 15వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)ను బోల్తా కొట్టించింది.

 మహిళల సింగిల్స్ ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో సెరెనా సోదరి వీనస్ విలియమ్స్ 6-3, 6-4తో 12వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందగా... 13వ సీడ్ మకరోవా (రష్యా) 6-3, 7-5తో స్వితోలినా (ఉక్రెయిన్)పై, 25వ సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా) 7-6 (11/9), 4-6, 6-3తో సిబుల్కోవా (స్లొవేకియా)పై విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.

 ఫాగ్‌నిని సంచలనం
 పురుషుల సింగిల్స్ విభాగంలో పెను సంచలనాలు నమోదయ్యాయి. స్పెయిన్‌కు చెందిన ఇద్దరు అగ్రశ్రేణి ఆటగాళ్లు రాఫెల్ నాదల్, డేవిడ్ ఫెరర్‌తోపాటు పదో సీడ్ మిలోస్ రావ్‌నిక్ (కెనడా) మూడో రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు. 32వ సీడ్ ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) అద్భుత పోరాటంతో తన కెరీర్‌లోనే గొప్ప విజయాన్ని సాధించాడు. 3 గంటల 46 నిమిషాలపాటు జరిగిన హోరాహోరీ పోరులో ఫాగ్‌నిని 3-6, 4-6, 6-4, 6-3, 6-4తో ఎనిమిదో సీడ్ నాదల్‌ను కంగుతినిపించాడు. ఫాగ్‌నిని 57 అనవసర తప్పిదాలు చేసినా, ఏకంగా 70 విన్నర్స్ కొట్టి నాదల్ ఆశలను వమ్ము చేశాడు. ఇప్పటివరకు కెరీర్‌లో 151 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌లు ఆడిన నాదల్ తొలి రెండు సెట్‌లు గెలిచాక, ఆ తర్వాత వరుసగా మూడు సెట్‌లు చేజార్చుకొని ఓడిపోవడం ఇదే ప్రథమం.

ఈ ఏడాది నాదల్‌పై ఫాగ్‌నినికిది మూడో విజయం కావడం విశేషం. బార్సిలోనా, రియో ఓపెన్ టోర్నీల్లో కూడా ఫాగ్‌నిని చేతిలో నాదల్ ఓడిపోయాడు. ఇతర మ్యాచ్‌ల్లో 27వ సీడ్ జెరెమీ చార్డీ (ఫ్రాన్స్) 7-6 (8/6), 4-6, 6-3, 6-1తో ఏడో సీడ్ ఫెరర్‌ను బోల్తా కొట్టించగా... 18వ సీడ్ ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్) 6-2, 7-6 (7/4), 6-3తో రావ్‌నిక్‌ను ఓడించాడు. 14వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) 6-2, 7-5, 3-6, 1-3తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా వైదొలగడంతో అతని ప్రత్యర్థి, 23వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్)ను విజేతగా ప్రకటించారు.

 ప్రిక్వార్టర్స్‌లో జొకోవిచ్, సిలిచ్
 మరోవైపు టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 7-5, 7-5తో ఆండ్రియాస్ సెప్పి (ఇటలీ)పై గెలుపొందగా... డిఫెండింగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 6-7 (5/7), 7-6 (7/1), 6-3, 6-7 (3/7), 6-1తో మిఖాయిల్ కుకుష్‌కిన్ (కజకిస్తాన్)పై చెమటోడ్చి విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. 19వ సీడ్ సోంగా (ఫ్రాన్స్), అన్‌సీడెడ్ బెనోయిట్ పెయిర్ (స్పెయిన్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.

 సానియాకు మిశ్రమ ఫలితాలు
 మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) ద్వయం 6-1, 6-1తో తిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)-చియా జంగ్ చువాంగ్ (చైనీస్ తైపీ) జోడీపై నెగ్గి మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. అయితే మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జంట సానియా మీర్జా (భారత్) -బ్రూనో సోరెస్ (బ్రెజిల్) తొలి రౌండ్‌లోనే చేతులెత్తేసింది. సానియా-సోరెస్ ద్వయం 3-6, 3-6తో హలవకోవా-లుకాజ్ కుబోట్ (చెక్ రిపబ్లిక్) జోడీ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ రోహన్ బోపన్న (భారత్)-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) జంట 6-4, 6-4తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)-వెర్దాస్కో (స్పెయిన్) జోడీపై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement