ఇందర్ 'చీట్' | Shot putter Inderjeet Singh alleges conspiracy after failing dope test | Sakshi
Sakshi News home page

ఇందర్ 'చీట్'

Published Wed, Jul 27 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

ఇందర్ 'చీట్'

ఇందర్ 'చీట్'

* డోపింగ్‌లో దొరికిన ఇందర్జీత్ సింగ్
* తనపై కుట్ర జరిగిందన్న పంజాబ్ అథ్లెట్

న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు ముందు భారత బృందానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ రెజ్లర్ నర్సింగ్ యాదవ్ (74 కేజీలు) డోపింగ్‌లో పట్టుబడి రెండు రోజులు కూడా గడవకముందే మరో అథ్లెట్ ఇందర్జీత్ సింగ్ కూడా డోపింగ్‌లో విఫలమయ్యాడు. పంజాబ్‌కు చెందిన 28 ఏళ్ల ఈ షాట్‌పుటర్ వద్ద సేకరించిన ‘ఎ’ శాంపిల్ పాజిటివ్‌గా తేలిందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ప్రకటించింది. ఇందర్జీత్‌కు జూన్ 22న డోపింగ్ పరీక్ష నిర్వహించామని...

అతని నమూనాలో నిషేధిత ఉత్ప్రేరకాలు ఆండ్రోస్టెరాన్, ఎథియోక్లొనోలోన్ ఆనవాళ్లు ఉన్నాయని ‘నాడా’ అధికారులు తెలిపారు. రియో ఒలింపిక్స్‌కు కేవలం తొమ్మిది రోజులే ఉన్నందున వారం రోజుల్లోపు ‘బి’ శాంపిల్‌ను కూడా పరీక్షించుకోవాలని ఇందర్జీత్‌ను కోరారు. ఒకవేళ దాంట్లో కూడా పాజిటివ్‌గా తేలితే అతనిపై నాలుగేళ్ల నిషేధం విధించే అవకాశముంది. 2014 ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గిన ఇందర్జీత్, 2015 ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచాడు. గతేడాది మేలో ఫెడరేషన్ కప్‌లో అతను ఇనుప గుండును 20.65 మీటర్ల దూరం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు.
 
నన్ను ఇరికించారు...
మరోవైపు డోపింగ్‌లో దొరికిన ఇందర్జీత్ సింగ్ తనపై కుట్ర జరిగిందని ఆరోపించాడు. తానెలాంటి నిషేధిత ఉత్ప్రేరకాలు వాడలేదని, భారత అథ్లెటిక్స్‌లో ఉన్న లోపాలపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నందునే తనను డోపింగ్‌లో ఇరికించారని ఈ పంజాబ్ అథ్లెట్ అన్నాడు. ‘ఎక్కడో తేడా జరిగింది. నా శాంపిల్‌ను ఎవరో కలుషితం చేశారు. ఈ అంశంపై ఇంకా ఎక్కువ మాట్లాడదల్చుకోలేదు. ఈ దేశంలో ఎవరైతే గళం విప్పుతున్నారో, వారిని అణగదొక్కుతున్నారు’ అని ఇందర్జీత్ అన్నాడు.  

‘గతేడాది, ఈ ఏడాది కలిపి 50కంటే ఎక్కువసార్లు నాకు డోపింగ్ టెస్టులు నిర్వహించారు. దేనిలోనూ ఫలితం పాజిటివ్‌గా రాలేదు. భారత అథ్లెటిక్స్‌లో ఉన్న లోపాలను నేను ఎత్తి చూపుతున్నాను. ఒలింపిక్స్‌లో నేను పతకం గెలిస్తే, వారికి మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి నన్ను డోపింగ్‌లో ఇరికించారు’ అని ఇందర్జీత్ అన్నాడు. టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం కింద ఇందర్జీత్ ఈ ఏడాది అమెరికాలో శిక్షణకు వెళ్లి వచ్చాడు.
 
ఈ ఇద్దరు మాత్రమే...
ఇటీవల కాలంలో పలువురు భారత క్రీడాకారులు డోపింగ్‌లో దొరికారని... ఈ జాబితాలో నర్సింగ్ యాదవ్, ఇందర్జీత్ సింగ్ మాత్రమే రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందారని ‘నాడా’ డెరైక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. ‘మేలో ఇందర్జీత్‌కు నిర్వహించిన డోప్ పరీక్షలో ఫలితం నెగెటివ్‌గా వచ్చింది. జూన్‌లో అతను నమూనా ఇవ్వకుండా తప్పించుకున్నాడు’ అని నవీన్ అగర్వాల్ వెల్లడించారు. రియోకు అర్హత పొందిన భారత క్రీడాకారులందరికీ కనీసం రెండు లేదా మూడుసార్లు డోపింగ్ పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు.
 
మరోవైపు డోపింగ్‌లో తనను కావాలనే ఇరికించారని, ఇందులో ‘సాయ్’ అధికారి, ఇతర క్రీడాకారుల పాత్ర ఉందని రెజ్లర్ నర్సింగ్ యాదవ్ చేసిన ఆరోపణలను ‘నాడా’ క్రమశిక్షణ సంఘం బుధవారం విచారిస్తుందని నవీన్ అగర్వాల్ వివరించారు. జూన్ 2న నర్సింగ్‌కు నిర్వహించిన పరీక్ష నెగెటివ్‌గా వచ్చిందని... 25న సేకరించిన రక్త నమూనా కూడా బాగానే ఉందని, అయితే మూత్రం నమూనా పాజిటివ్‌గా వచ్చిందని ఆయన తెలిపారు.
 
ఆటంకాలు ఎదురైనా అందలానికి...
ఆసియాలోనే అత్యుత్తమ షాట్‌పుటర్ అయిన ఇందర్జీత్ సింగ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో శ్రమించాడు. తండ్రి గుర్‌దయాల్ సింగ్ ఉద్యోగరీత్యా ఇందర్జీత్ కుటుంబం పంజాబ్ నుంచి మధ్యప్రదేశ్‌కు మకాం మార్చింది. అయితే 2007లో తండ్రి మరణంతో ఈ అథ్లెట్ కెరీర్ సందిగ్ధంలో పడింది. అయితే అతని కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల ఆర్థిక సహకారంతో ఇందర్జీత్ కెరీర్‌ను కొనసాగించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తు, 150 కేజీల బరువున్న ఇందర్జీత్ గతేడాది తాను పాల్గొన్న ఐదు అంతర్జాతీయ ఈవెంట్స్‌లోనూ ఐదు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.

గతేడాది కొరియాలో జరిగిన ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడల్లో ఇందర్జీత్ షాట్‌పుట్‌లో స్వర్ణం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఆసియా చాంపియన్‌షిప్‌లో, ఆసియా గ్రాండ్‌ప్రి మీట్‌లలో కూడా పసిడి పతకాలు నెగ్గాడు. ఇందర్జీత్ శిక్షణ ఖర్చుల కోసం అతని కుటుంబం తమ సొంత ఇల్లుతోపాటు రెండు కిరాణా దుకాణాలను అమ్మకానికి పెట్టింది. మరోవైపు రెండు క్రీడా సేవా సంస్థలు ఇందర్జీత్ శిక్షణ ఖర్చుల కోసం విరాళాల సేకరణ చేపట్టగా... రూ. ఆరున్నర లక్షలు సమకూరడం విశేషం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement