శభాష్ శ్రేయస్
►ఢిల్లీని గెలిపించిన అయ్యర్
►కీలక సమయంలో అద్భుత ఇన్నింగ్స్
►లయన్స్ ఖాతాలో మరో ఓటమి
లయన్స్ గర్జించినా... డెవిల్స్ ముందు తోకముడవక తప్పలేదు. ఆఖరి ఓవర్‌లో డ్రామా నడిచినా ఢిల్లీదే పైచేయి అయ్యింది. శ్రేయస్ అయ్యర్, కమిన్స్ ఏడో వికెట్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. ఢిల్లీపై భారీ స్కోరు చేసినా... గుజరాత్‌కు పరాజయం తప్పలేదు.
కాన్పూర్: గుజరాత్ లయన్స్‌పై 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించిన ఢిల్లీ... ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగులకే ఆలౌటైంది. అదే ఢిల్లీ మళ్లీ గుజరాత్‌పై రెచ్చిపోయింది. ప్రతీకారానికి అవకాశమివ్వకుండా ఘనవిజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్ డెవిల్స్ 2 వికెట్ల తేడాతో గుజరాత్ లయన్స్‌పై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ లయన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అరోన్ ఫించ్ (39 బంతుల్లో 69; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) దినేశ్ కార్తీక్ (28 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 197 పరుగులు చేసి గెలిచింది. శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 96; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కమిన్స్ (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) తోడ్పాటునందించాడు. శ్రేయస్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
విరుచుకుపడిన ఫించ్...
గుజరాత్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన స్మిత్ (8), వన్‌డౌన్‌లో వచ్చిన సురేశ్ రైనా (6) విఫలమయ్యారు. ఈ దశలో మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 34; 5 ఫోర్లు, 1 సిక్స్), దినేశ్ కార్తీక్‌లు భారం తమ భుజాన వేసుకున్నారు. ధాటిగా ఆడుతున్న కిషన్‌ను మిశ్రా బోల్తా కొట్టించాడు. అపుడు జట్టు స్కోరు 56 పరుగులే. దీంతో కార్తీక్‌కు అరోన్ ఫించ్ జతయ్యాడు. వీళ్లిద్దరూ వికెట్ పడకుండా ధాటిని కొనసాగించారు. అమిత్ మిశ్రా వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో ఫించ్ రెండు వరుస సిక్సర్లు బాదాడు. అదుపు తప్పిన బంతినల్లా బౌండరీకి తరలిస్తూ జట్టు స్కోరును పెంచాడు. ఇదే జోరుతో ఫించ్ అర్ధసెంచరీకి సమీపించాడు. నాలుగో వికెట్‌కు 92 పరుగులు జోడించాక బ్రాత్‌వైట్ ఈ జోడీని విడగొట్టాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన దినేశ్ కార్తీక్... అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఆ మరుసటి బంతిని సిక్సర్‌గా మలిచిన ఫించ్ 32 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత వేగం పెంచిన అతను షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన రవీంద్ర జడేజా 13, ఫాల్క్‌నర్ 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. ఢిల్లీ బౌలర్లు షమీ, కమిన్స్ బ్రాత్‌వైట్, మిశ్రా తలా ఒక వికెట్ తీశారు.
అయ్యర్ సూపర్...
భారీ లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ ఆరంభంలో తడబడింది. 11 పరుగుల వద్ద సామ్సన్ (10)ను, 15 పరుగుల వద్ద రిషభ్ పంత్ (4) వికెట్లను కోల్పోయింది. కీలక వికెట్లను ఆదిలోనే కోల్పోయిన ఢిల్లీకి లక్ష్యఛేదన తలకు మించిన భారమైంది. అయితే శ్రేయస్ పాలుపంచుకున్న రెండు భాగస్వామ్యాలు మ్యాచ్‌లో ఢిల్లీని నడిపించాయి. మొదట మూడో వికెట్‌కు కరుణ్ నాయర్ (15 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ కలిసి 57 పరుగులు జోడించారు. తర్వాత శామ్యూల్స్ (1), అండర్సన్ (6)ల రనౌట్‌తో ఢిల్లీ కష్టాలు మొదటికొచ్చాయి. ఈ దశలో శ్రేయస్, కమిన్స్ భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపుతిప్పింది. వీళ్లిద్దరూ ఏడో వికెట్‌కు కేవలం 27 బంతుల్లోనే వేగంగా 61 పరుగులు జతచేశారు. 19వ ఓవర్లో కమిన్స్, చివరి ఓవర్లో శ్రేయస్ ఔట్ కావడంతో ఢిల్లీ శిబిరంలో ఆందోళన పెరిగింది. కానీ బాసిల్ థంపి వేసిన ఆఖరి ఓవర్లో అమిత్ మిశ్రా (2 బంతుల్లో 8 నాటౌట్; 2 ఫోర్లు) రెండు వరుస బౌండరీలతో జట్టును గెలిపించాడు.
ఎల్బీకి అప్పీల్ చేస్తే...
రిషభ్ పంత్ నిర్లక్ష్యమో, సోమరితనమో గానీ గుజరాత్‌కు వికెట్ మాత్రం అప్పనంగా దొరికింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన ప్రదీప్ సాంగ్వాన్ బౌలింగ్‌లో తానాడిన తొలి బంతికే ఫోర్ కొట్టిన రిషభ్ ఆ మరుసటి బంతికే పెవిలియన్ చేరాడు. సాంగ్వాన్ సహా ఫీల్డర్లంతా ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా... రిషభ్ బంతిని ఏమాత్రం గమనించకుండా క్రీజు బయటే తాపీగా నిల్చున్నాడు. స్లిప్‌లో నిల్చున్న రైనా వెంటనే బంతిని అందుకొని వికెట్లను గిరాటేశాడు. దీంతో రిషభ్ అనూహ్యంగా రనౌటయ్యాడు.