శ్రీకాంత్... ఈసారైనా!
తొలి రౌండ్ మ్యాచ్‌పై ఉత్కంఠ నేటి నుంచి ఆసియా చాంపియన్‌షిప్
వుహాన్ (చైనా): వరుసగా నాలుగు టోర్నమెంట్‌లలో తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టిన భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఐదో టోర్నమెంట్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. బుధవారం మొదలయ్యే ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 19వ ర్యాంకర్ లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)తో శ్రీకాంత్ తలపడనున్నాడు. రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు ఇదే చివరి టోర్నీ కావడంతో పలువురు స్టార్ ఆటగాళ్లు ఈ టోర్నీ బరిలోకి దిగుతున్నారు.
ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలతోపాటు చైనా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో కూడా శ్రీకాంత్ తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. దాంతో ఈసారైనా అతను తొలి రౌండ్ అడ్డంకిని అధిగమిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి. ఇక మహిళల సింగిల్స్ విభాగం తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఫిత్రియాని (ఇండోనేసియా)తో సైనా నెహ్వాల్... కుసుమస్తుతి (ఇండోనేసియా)తో సింధు తలపడనున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి-మనూ అత్రి; ప్రణవ్ చోప్రా-అక్షయ్ బరిలో ఉన్నారు.