
సెమీస్‌లో సింధు, జయరామ్
కుచింగ్ (మలేసియా): గత ఏడాది నిలకడగా రాణించిన హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పి.వి.సింధు కొత్త ఏడాదిలోనూ అదే జోరును కనబరుస్తోంది. సీజన్ తొలి టోర్నీ మలేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్‌లో సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సింధు 23-21, 21-9తో పోర్న్‌టిప్ బురానాప్రాసెర్ట్‌సుక్ (థాయ్‌లాండ్)పై నెగ్గింది. ఈ గెలుపుతో గతేడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో పోర్న్‌టిప్ చేతిలో ఎదురైన ఓటమికి సింధు బదులు తీర్చుకుంది.
శనివారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ నజోమి ఒకుహారా (జపాన్)తో సింధు ఆడుతుంది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో అజయ్ జయరామ్ సెమీఫైనల్లో అడుగుపెట్టగా... హైదరాబాద్‌కు చెందిన పారుపల్లి కశ్యప్, సాయిప్రణీత్ మాత్రం మూడో రౌండ్‌లో ఓడిపోయారు. క్వార్టర్స్‌లో జయరామ్ 21-16, 21-23, 21-8తో డారెన్ లూ (మలేసియా)పై గెలుపొందగా... మూడో రౌండ్‌లో కశ్యప్ 21-13, 17-21, 13-21తో డెరెక్ వోంగ్ (సింగపూర్) చేతిలో; సాయిప్రణీత్ 15-21, 17-21తో లీ హున్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి పాలయ్యారు.