
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సిరిల్‌వర్మ (మెదక్), ఎ. అభిలాష (హైదరాబాద్) సత్తా చాటారు. కోదాడలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విభాగాల్లో విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నారు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో రెండోసీడ్ సిరిల్ వర్మ 21–17, 21–16తో టాప్‌సీడ్ సి. రాహుల్ యాదవ్ (హైదరాబాద్)కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన అభిలాష ఫైనల్లో 21–18, 21–17తో మూడోసీడ్ కె. వైష్ణవిని ఓడించి తన స్థాయిని ప్రదర్శించింది. మరోవైపు డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి సృష్టి జూపూడి మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను అందుకుంది. మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్‌సీడ్ సాహితి బండి (మెదక్)– సృష్టి జంట 21–12, 21–11తో శ్రీవిద్య– వై. సాయిప్రియ (మెదక్) జోడీపై... మిక్స్‌డ్ డబుల్స్ కేటగిరీలో టాప్‌సీడ్ పి. శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)– సృష్టి ద్వయం 21–18, 21–18తో మూడో సీడ్ బి. నవనీత్– సాహితి (మెదక్) జోడీపై విజయం సాధించాయి.
పురుషుల డబుల్స్ ఫైనల్లో రెండోసీడ్ బి. నవనీత్ (మెదక్)– సిద్ధార్థ్ (రంగారెడ్డి) జంట 21–11, 16–21, 24–22తో టాప్‌సీడ్ పి. శ్రీకృష్ణ సాయికుమార్ (రంగారెడ్డి)– పి. విష్ణువర్ధన్ గౌడ్ (హైదరాబాద్) జోడీకి షాకిచ్చింది. 65 ఏళ్ల కేటగిరీలో పురుషుల సింగిల్స్ ఫైనల్లో పి. రాయలింగు (ఆదిలాబాద్) 21–5, 21–16తో దస్తగిరి (నల్లగొండ)పై, 70 ఏళ్ల పురుషుల సింగిల్స్ తుదిపోరులో వీవీఆర్ రావు (మెదక్) 21–6, 17–21, 21–17తో సి. విజయ్ కుమార్ (హైదరాబాద్)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment