సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారుడు సిరిల్ వర్మ సత్తా చాటాడు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో సిరిల్ వర్మ విజేతగా నిలిచి టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. ఫైనల్లో పదమూడో సీడ్ సిరిల్ వర్మ 21–17, 13–21, 21–8తో కిరణ్ జార్జ్ (కేరళ)పై విజయం సాధించాడు. మహిళల విభాగంలో మాల్విక బన్సోద్ (ఏఏఐ) చాంపియన్‌గా నిలిచింది. మరోవైపు డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు పొదిలే శ్రీకృష్ణ సాయికుమార్‌కు నిరాశ ఎదురైంది.
పురుషుల, మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన శ్రీకృష్ణ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో శ్రీకృష్ణ సాయికుమార్ (తెలంగాణ)–గౌస్ షేక్ (ఏపీ) ద్వయం 20–22, 5–14తో రెండో సీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)–ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ రోహన్ కపూర్ (ఎయిరిండియా)–రుతుపర్ణ పండా (ఒడిశా) జంట 21–19, 21–14తో శ్రీకృష్ణ సాయికుమార్–కనిక కన్వల్ (రైల్వేస్) జోడీపై గెలుపొంది చాంపియన్‌గా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మనీషా (ఆర్‌బీఐ)–రుతుపర్ణ (ఒడిశా) ద్వయం 21–18, 21–13తో టాప్ సీడ్ అపర్ణ బాలన్ (పెట్రోలియం)–ప్రజక్తా సావంత్ (ఎయిరిండియా) జోడీకి షాకిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment