మెల్‌బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తమపై విధించిన నిషేధాన్ని సవాలు చేయబోమని స్టీవ్ స్మిత్, బాన్‌క్రాఫ్ట్ స్పష్టం చేశారు. కేప్‌టౌన్ టెస్టులో బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో క్రికెట్ ఆస్ట్రేలియా స్మిత్, వార్నర్‌పై ఏడాది, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ శిక్షపై ఆటగాళ్లు స్వతంత్ర కమిషనర్ ముందు సవాలు చేసుకునే హక్కు ఉంది. ఇందుకు గడువు (ఏప్రిల్ 11) సమీపిస్తుండటంతో ఈ అంశంపై వీరిద్దరు స్పందించారు. ‘తిరిగి దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఏం చేయడానికైనా నేను సిద్ధమే. గతంలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నా. కెప్టెన్‌గా ఈ వ్యవహారానికి పూర్తి బాధ్యత నాదే. సీఏ విధించిన నిషేధాన్ని సవాలు చేయను. ఈ నిర్ణయం ద్వారా సీఏ బలమైన సందేశాన్ని ఇవ్వదలచింది. దాన్ని నేను శిరసావహిస్తాను’ అని స్మిత్ ట్విట్టర్ ద్వారా తెలిపాడు. బాన్‌క్రాఫ్ట్ కూడా స్మిత్‌ను అనుసరిస్తూ... తాను కూడా నిషేధంపై అప్పీలుకు వెళ్లదలుచుకోలేదని స్పష్టం చేశాడు.
‘నిషేధంపై అప్పీలు చేయదలుచుకోలేదు. నిషేధం పూర్తయిన తర్వాతే తిరిగి మైదానంలో దిగుతాను. అప్పటి వరకు ఆసీస్ ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నం చేస్తాను’ అని అన్నాడు. మరోవైపు శిక్షలు మరీ ఎక్కువగా ఉన్నాయని వాటిని తగ్గించాలని ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) డిమాండ్ చేస్తోంది. నిషేధానికి గురైన మరో క్రికెటర్ డేవిడ్ వార్నర్ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ఓ ఆసీస్ మీడియా సంస్థతో పది లక్షల డాలర్ల మొత్తానికి ఒప్పందం చేసుకున్న ప్రత్యేక ఇంటర్వ్యూలో వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టనున్నాడని సమాచారం.
శిక్ష అనుభవిస్తాం
Published Thu, Apr 5 2018 1:23 AM | Last Updated on Thu, Apr 5 2018 1:23 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment