స్మృతి మంధాన
గువాహటి : బ్యాటింగ్ చేసేటప్పుడు భయపడకుండా ఆడాలని టీమిండియా మహిళా టీ20 తాత్కాలిక కెప్టెన్ స్మృతి మంధాన సహచరులకు సూచించారు. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత మహిళలు ఐదు వికెట్ల తేడాతో పరాజయం పొంది మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం కెప్టెన్ స్మృతి మంధాన మాట్లాడుతూ.. భయాన్ని పక్కనపెట్టి బ్యాటర్స్ బ్యాటింగ్ చేయాలని అభిప్రాయపడ్డారు. ‘దేశవాళి క్రికెట్‌లో ఎలా ఆడుతామో.. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా అలానే రాణించాలి. అలాంటప్పుడే భారీ స్కోర్లు చేయగలం. భయానికి, నిర్లక్ష్యానికి కొంత మాత్రమే తేడా. మా బ్యాటర్స్‌ది నిర్లక్ష్యమని నేను భావించడం లేదు. నాతో సహా మేం భయాన్ని వీడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. అంతేకాకుండా మేం డాట్ బాల్స్‌ను కూడా తగ్గించుకోవాలి. సింగిల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేయడంపై కూడా దృష్టి పెట్టాలి. ఆడితే షాట్స్ లేకుంటే డాట్స్.. అన్న తరహాలో మా బ్యాటింగ్ ఉంది. ఇదే మాకు ప్రత్యర్థికి ఉన్న తేడా. దీన్ని ఎలాగైన మార్చుకుంటాం.’ అని వ్యాఖ్యానించారు.
ఇక ఈ మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 112 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఇంగ్లండ్ మహిళలు 19.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఫలితంగా మూడు టీ20ల సిరీస్‌ను ఇంకా మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకున్నారు. భారత్‌తో జరిగిన రెండో టీ20లో ఇంగ్లండ్ ఓపెనర్ డానియల్లీ వ్యాట్(64 నాటౌట్; 55 బంతుల్లో 6 ఫోర్లు) కడవరకూ క్రీజ్‌లో ఉండి విజయంలో ముఖ్య భూమిక పోషించారు. ఆమెకు జతగా లారెన్ విన్‌ఫీల్డ్(29; 23 బంతుల్లో 4 ఫోర్లు) బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేశారు. భారత బ్యాటర్స్‌లో మిథాలీ రాజ్ చేసిన 20 పరుగులకే జట్టు తరఫున అత్యధిక స్కోరు. మంధాన(12), హర్లీన్ డియాల్(14), దీప్తి శర్మ(18), భారతి ఫుల్మాలి(18) ఇలా అంతా విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment