సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అమ్మాయి సౌజన్య భవిశెట్టి సొంతం చేసుకుంది. పుణేలో శనివారం జరిగిన ఫైనల్లో సౌజన్య 7-5, 6-2తో భారత్‌కే చెందిన మిహికా యాదవ్‌ను ఓడించింది. గంటా 27 నిమిషాలపాటు జరిగిన ఈ తుది పోరులో ఎడంచేతి వాటం క్రీడాకారిణి సౌజన్య ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయింది.
ఈ టోర్నీ మొత్తంలో సౌజన్య తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. 22 ఏళ్ల సౌజన్యకిది మూడో ఐటీఎఫ్ సింగిల్స్ టైటిల్. 2013లో షర్మ్ ఎల్ షేక్ (ఈజిప్టు), 2014లో ఔరంగాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్ టోర్నీలలో సౌజన్య విజేతగా నిలిచింది.