కోల్‌కతా: టీమిండియా క్రికెట్ జట్టులో గతంలోనూ గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఇప్పుడు ఉన్న జట్టులా అతి తక్కువ సమయంలో అత్యధిక విజయాలను సాధించలేదంటూ టీమిండియా కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ మండిపడ్డారు. ‘అవి అజ్ఞానంతో చేసిన వ్యాఖ్యలు. రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భారత మాజీ క్రికెటర్ చేతన్ శర్మ, నేను, ఎంఎస్ ధోని లాంటి వాళ్లం భారత్ తరఫున ఆడాం. అన్ని తరాల వాళ్లం దేశం కోసమే ఆడాము. ఇప్పుడు అలాగే విరాట్ కోహ్లి ఆడుతున్నాడు. మేమందరమూ టీమిండియాకు చెందిన వాళ్లమే. ఆయా సమయాల్లో మేమందరమూ ప్రాతినిధ్యం వహిస్తూ ఆడాము. ఒక తరంతో మరొక తరం క్రికెటర్లని పోల్చుతూ మాట్లాడడం సరికాదు. నేను కూడా చాలా మాట్లాడగలను. కానీ అలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు కదా. భారత్ కోసం విరాట్ సేన కష్టపడే ఆడుతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘ప్రస్తుత భారత క్రికెట్ జట్టు ప్రయాణం అద్భుతంగా ఉంది. మంచి విజయాలు సాధిస్తున్నారు. మూడేళ్లలో టీమిండియా విదేశాల్లో 9 మ్యాచులు, మూడు సిరీస్‌లు గెలిచింది. చివరి 15-20 ఏళ్లలో ఇంతటి తక్కువ సమయంలో ఇన్ని విజయాలు సాధించిన జట్టుని నేను చూడలేదు. గత జట్లలో గొప్ప ఆటగాళ్లు కూడా ఉన్నారు’ అని రవిశాస్త్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పలువురు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను సునీల్ గావస్కర్ కూడా విమర్శించిన విషయం తెలిసిందే. తాను జట్టులో ఉన్న సమయంలో వెస్టిండీస్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో విజయాలు సాధించామని ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment