కోల్‌కతా: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దాదాపు రెండేళ్లుగా పరిపాలకుల కమిటీ (సీఓఏ) నియంత్రణలోకి వెళ్లిపోయింది. అప్పటి నుంచి వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. బోర్డు వ్యవహారాలను పర్యవేక్షించడం కాకుండా తామే ఒక వ్యవస్థగా మారి సీఓఏ అన్ని అధికారాలు చెలాయిస్తోంది. అయితే సుప్రీం కోర్టు నియమించిన కమిటీ కావడంతో ఇప్పటి వరకు ఎవరూ బహిరంగంగా ఈ కమిటీని విమర్శించే సాహసం చేయడం లేదు. ఇప్పుడు మొదటిసారి ఒక క్రికెట్ స్టార్ దీనిపై నోరెత్తాడు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్ష హోదాలో సీఓఏ పనితీరును ప్రశ్నించాడు. తన ప్రశ్నలతో అతను నేరుగా ఒక లేఖ రాశాడు. ఇందులో ప్రధానాంశాలు గంగూలీ మాటల్లోనే...
‘భారత క్రికెట్ పరిపాలన ఎక్కడికి దారి తీస్తుందో అనే భయం కారణంగా ఆవేదనతో ఈ లేఖ రాస్తున్నాను. ఎన్నో ఏళ్లు క్రికెట్ ఆడటంతో మా జీవితాలు గెలుపోటములతో ముడిపడిపోయాయి. భారత క్రికెట్ పరువు మర్యాదలు కూడా మాకు ఎంతో ముఖ్యం. అందుకే తాజా పరిస్థితి గురించి ఆలోచించాల్సి వస్తోంది. రెండేళ్లుగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ప్రపంచం దృష్టిలో భారత క్రికెట్ పరిపాలన స్థాయి పడిపోతోంది. అదే విధంగా లక్షలాది అభిమానుల నమ్మకం కూడా సడలిపోతోందని ఆందోళనతో చెప్పాల్సి వస్తోంది. వాస్తవాలేమిటో నాకు తెలీదు గానీ ఇటీవల వచ్చిన వేధింపుల ఆరోపణలు, ముఖ్యంగా వాటిని ఎదుర్కొన్న తీరు మొత్తం బీసీసీఐ పరువు తీసేశాయి. సీఓఏ నలుగురు సభ్యుల నుంచి ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు వారిద్దరి మధ్య కూడా అభిప్రాయ భేదాలు ఉన్నట్లున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీజన్ మధ్యలో క్రికెట్ నిబంధనలు మారిపోతున్నాయి. కమిటీలు తీసుకున్న నిర్ణయాలను అగౌరవపరుస్తూ పక్కన పెట్టేస్తున్నారు.
కోచ్‌ను ఎంపిక చేసే విషయంలో నాకు భయంకరమైన అనుభవం ఎదురైంది (దీని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది). బోర్డు వ్యవహారాల్లో భాగంగా ఉన్న నా మిత్రుడొకడు తాము ఎవరిని సంప్రదించాలని నన్ను అడిగితే సమాధానం ఇవ్వలేకపోయాను. అంతర్జాతీయ మ్యాచ్‌కు ఒక క్రికెట్ సంఘం నుంచి ఎవరినైనా పిలవాలని భావిస్తే ఎవరికి ఆహ్వానం పంపాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా గొప్ప క్రికెటర్లు, అద్భుతమైన పరిపాలకులు చేసిన శ్రమ వల్ల వేలాదిమంది అభిమానులు మైదానాలకు వచ్చారు. దాని వల్లే భారత క్రికెట్ ఈ స్థాయికి ఎదిగింది. అయితే ప్రస్తుత పరిస్థితిని చూస్తే అది ప్రమాదంలో పడిందని చెప్పగలను. జనం దీనిని వింటున్నారని భావిస్తున్నా!’.
భారత క్రికెట్ ప్రమాదంలో పడింది!
Published Wed, Oct 31 2018 1:29 AM | Last Updated on Wed, Oct 31 2018 1:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment