రాహుల్ ద్రవిడ్, కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్, సౌరవ్ గంగూలీ
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ ఆపరేషన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్‌నూ ‘కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) కింద ప్రశ్నించడంపై అతని సహచరుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మండి పడ్డాడు. కాన్‌ఫ్లిక్ట్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా ద్రవిడ్‌కు బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డీకే జైన్ మంగళవారం నోటీసు పంపించారు. జాతీయ క్రికెట్ అకాడమీలో పని చేస్తున్న సమయం లోనే ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఇండియా సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా ఎలా విధులు నిర్వర్తిస్తారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజయ్ గుప్తా చేసిన ఆరోపణలపై ద్రవిడ్‌ను జస్టిస్ జైన్ ప్రశ్నించారు.
అయితే గంగూలీకి ఇది తీవ్ర అసహనం తెప్పించింది. ఈ అంశంపై అతను ఘాటుగా స్పందించాడు. ‘భారత క్రికెట్‌లో కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అనేది కొత్త రకం ఫ్యాషన్ అయిపోయింది. వార్తల్లో నిలిచేందుకు ఇదో పద్ధతి. ఇక భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి’ అని సౌరవ్ ట్వీట్ చేశాడు. ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఈ విషయంలో గంగూలీకి మద్దతు పలికాడు. ‘నిజంగానా...ఇది ఎంత వరకు వెళుతుందో తెలీదు. భారత క్రికెట్‌కు ఇంతకంటే సరైన వ్యక్తి లభించడు. ఇలాంటి దిగ్గజాలకు నోటీసులు పంపడం అంటే వారిని అవమానించినట్లే. క్రికెట్ బాగుపడాలంటే వారి సేవలు అవసరం. నిజంగానే దేవుడే కాపాడాలి’ అని భజ్జీ ట్వీట్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment