Conflict of interest
-
విరాట్ కోహ్లికి సరికొత్త తలపోటు
న్యూఢిల్లీ:: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్(పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) అంశం సరికొత్త తలపోటుగా మారింది. కోహ్లి ఒకేసారి రెండు వ్యాపార సంస్థల్లో కీలక స్థానాల్లో ఉన్నాడంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యుడు సంజీవ్ గుప్తా ఫిర్యాదు చేశాడు. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఎథిక్స్ అధికారి, అంబుడ్స్‌మన్ జస్టిన్ డీకే జైన్‌కు ఫిర్యాదు చేశాడు. ‘ బీసీసీఐలోని 38(4) నిబంధనను కోహ్లి అతిక్రమించాడు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధం. ఒక సమయంలో ఒక పోస్ట్‌లో ఉండాలనేది నిబంధనల్లో భాగం. దీన్ని కోహ్లి ఉల్లంఘించాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నాడు. (హార్దిక్-కృనాల్‌ల ‘తొలి’ ఇంటర్వ్యూ చూశారా?) దీనిపై డీకే జైన్ మాట్లాడుతూ.. ఒకేసారి రెండు పదవులు అనుభవిస్తూ బీసీసీఐ నిబంధనను కోహ్లి అతిక్రమించినట్లు ఫిర్యాదు అందింది. దీనిపై విచారించిన తర్వాత విరాట్‌కు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కల్గి ఉంటే నోటీసులిస్తామని అన్నారు. లోధా కమిటీ సంస్కరణల్లో భాగంగా ప్రస్తుత ఆటగాళ్లు, సెలెక్టర్లు, కామెంటేటర్లు, ఆఫీస్ బేరర్లు, మ్యాచ్ అధికారులు ఏకకాలంలో రెండు పదవుల్లో కొనసాగడానికి వీల్లేకుండా గతంలోనే బీసీసీఐ రాజ్యాంగ సవరణ చేసింది. కాగా, కోహ్లి స్పోర్ట్స్, కార్నర్‌స్టోన్ వెంచర్ పార్ట్‌నర్స్‌లలో కో-డైరెక్టర్‌గా ఉండడంతో పాటు కార్నర్‌స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిడెడ్‌లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నాడని గుప్తా ఫిర్యాదు చేశాడు. ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. అయితే మరి కోహ్లి నిజంగానే రెండింటిలోనూ కీలక పదవుల్లో ఉన్నాడా.. లేదా అనే అంశాన్ని డీకే జైన్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించనుంది. ఒకవేళ ఇది రుజువైతే కోహ్లిపై చర్యలు తప్పవు. (‘ఐపీఎల్‌తో పెద్దగా ఒరిగిందేమీ లేదు’) -
భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి
న్యూఢిల్లీ: భారత మాజీ కెప్టెన్, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ ఆపరేషన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్‌నూ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు) కింద ప్రశ్నించడంపై అతని సహచరుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మండి పడ్డాడు. కాన్ఫ్లిక్ట్పై వివరణ ఇవ్వాల్సిందిగా ద్రవిడ్‌కు బీసీసీఐ ఎథిక్స్ ఆఫీసర్ జస్టిస్ డీకే జైన్ మంగళవారం నోటీసు పంపించారు. జాతీయ క్రికెట్ అకాడమీలో పని చేస్తున్న సమయం లోనే ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఇండియా సిమెంట్స్‌లో వైస్ ప్రెసిడెంట్‌గా ఎలా విధులు నిర్వర్తిస్తారంటూ మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘం సభ్యుడు సంజయ్ గుప్తా చేసిన ఆరోపణలపై ద్రవిడ్‌ను జస్టిస్ జైన్ ప్రశ్నించారు. అయితే గంగూలీకి ఇది తీవ్ర అసహనం తెప్పించింది. ఈ అంశంపై అతను ఘాటుగా స్పందించాడు. ‘భారత క్రికెట్లో కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ అనేది కొత్త రకం ఫ్యాషన్ అయిపోయింది. వార్తల్లో నిలిచేందుకు ఇదో పద్ధతి. ఇక భారత క్రికెట్‌ను దేవుడే రక్షించాలి’ అని సౌరవ్ ట్వీట్ చేశాడు. ఆఫ్‌స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఈ విషయంలో గంగూలీకి మద్దతు పలికాడు. ‘నిజంగానా...ఇది ఎంత వరకు వెళుతుందో తెలీదు. భారత క్రికెట్‌కు ఇంతకంటే సరైన వ్యక్తి లభించడు. ఇలాంటి దిగ్గజాలకు నోటీసులు పంపడం అంటే వారిని అవమానించినట్లే. క్రికెట్ బాగుపడాలంటే వారి సేవలు అవసరం. నిజంగానే దేవుడే కాపాడాలి’ అని భజ్జీ ట్వీట్ చేశాడు. -
ముందుగా స్పష్టతనివ్వండి
కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్‌పై రాహుల్ ద్రవిడ్ ముంబై: పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు సంబంధించి భారత్ ‘ఎ’ జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ మరింత స్పష్టత కోరుతున్నారు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ మెంటార్‌గా వ్వవహరిస్తున్న రాహుల్ ద్రవిడ్ ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్’పై బీసీసీఐని స్పష్టతను కోరారు. బీసీసీఐతో ఆయనకు పది నెలల ఒప్పందమే ఉంది కాబట్టి ఆ తర్వాత ఐపీఎల్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ‘ఈ విషయంలో ఇప్పటికే నా పరిస్థితి గురించి సీఓఏకు లేఖ రాశాను. బీసీసీఐకి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నిబంధనల ప్రకారం నేను ఎలాంటి అతిక్రమణకు పాల్పడలేదు. అయితే మధ్యలో ఏమైనా రూల్స్ మార్చడం జరిగితే మాత్రం నన్ను విమర్శించడం సరికాదు. అందుకే ఈ అంశంపై మాకు స్పష్టత కావాలి. ఆ తర్వాతే మేం ఒక నిర్ణయం తీసుకోగలం’ అని ద్రవిడ్ స్పష్టం చేశారు. -
ప్రవీణ్ ఆమ్రేపై ఆరోపణలు నిజమే..
ముంబై: మాజీ టెస్టు క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే, మాజీ కర్ణాటక స్పిన్నర్ రఘురామ్ భట్లు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్టు తేలింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్ (విచారణాధికారి) జస్టిస్ ఏపీ షా విచారణలో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్‌కు క్లీన్చిట్ లభించింది. ముంబై క్రికెట్ సంఘం మేనేజింగ్ కమిటీలో సభ్యునిగా వ్యవహరిస్తున్న ఆమ్రే అటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచింగ్ స్టాఫ్‌లోనూ ఉన్నారు. రఘురామ్ భట్ కర్ణాటక క్రికెట్ సంఘంలో మేనేజింగ్ కమిటీ సభ్యులుగా.. అండర్–16, 14 చైర్మన్‌గా ఉండడంతో పాటు బ్రిజేష్ పటేల్ క్రికెట్ అకాడమీ, ఐడీబీఐ అకాడమీలో పనిచేస్తున్నారు. ఇక ముంబై క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్‌గా ఉన్న వెంగీ పుణేలో క్రికెట్ అకాడమీ నడుపుతున్నారు. తన పదవులు రెండూ గౌరవపూర్వకమైనవేనని ఇచ్చిన వివరణపై షా సంతృప్తి వ్యక్తం చేశారు. -
సంతకం చేయని హెచ్‌సీఏ
హెచ్‌సీఏ ముంబై: క్రికెట్ రాజకీయాల ప్రక్షాళనలో భాగమంటూ బీసీసీఐ కొత్తగా ప్రతిపాదించిన ‘కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్’ డిక్లరేషన్‌కు కొన్ని సభ్య సంఘాలనుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. క్రికెట్ పరిపాలనలో భాగంగా ఉంటూ ఆటకు సంబంధించిన ఇతర లాభసాటి వ్యాపారాలు తాము ఏమీ చేయడం లేదంటూ రాష్ట్రాల సంఘాలు బీసీసీఐకి డిక్లరేషన్ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు నెల రోజుల క్రితం బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 30 అసోసియేషన్లలో 4 మినహా మిగతా అన్నీ ఈ డిక్లరేషన్‌పై సంతకం చేశాయి. హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ)తో పాటు తమిళనాడు, కర్ణాటక, హర్యానా సంఘాలు మాత్రం దీనిపై స్పందించలేదు. హెచ్‌సీఏ అధ్యక్ష, కార్యదర్శులు అర్షద్ అయూబ్, జాన్ మనోజ్ సొంత అకాడమీలు నిర్వహిస్తున్నారని, వాటిలోని ఆటగాళ్లే టీమ్‌లోకి ఎంపికవుతారని బోర్డు మాజీ అధ్యక్షుడు శివలాల్ యాదవ్ ఇటీవల లోధా కమిటీకి స్వయంగా ఫిర్యాదు చేశారు. ‘కాన్ఫ్లిక్స్ ఆఫ్ ఇంట్రస్ట్ అనేందుకు మార్గదర్శకాలు ఏమిటి. మా అబ్బాయి క్రికెటర్ కావడాన్ని లేదా కమిటీలో సభ్యుడు కావడాన్ని మీరు ఎలా అడ్డుకుంటారు. క్రికెట్‌తోనే సంబంధాలు ఉన్నవాళ్లం మరో పని ఏం చేస్తాం. లోధా కమిటీ వచ్చి తనిఖీ చేయనివ్వండి’ అని హెచ్‌సీఏ సభ్యుడొకరు గట్టిగా స్పందించారు. ఈ నెల 30న బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. తమకు దీనిపై చాలా సందేహాలున్నాయని, అప్పటి వరకు ఎలాంటి సంతకం చేయబోమని తమిళనాడు, కర్ణాటక సంఘాలు స్పష్టంగా చెప్పేశాయి. బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరికి చెందిన హర్యానా సంఘం కూడా దీనిపై సంతకం చేయకపోవడం విశేషం.