ప్రవీణ్ ఆమ్రేపై ఆరోపణలు నిజమే..
ముంబై: మాజీ టెస్టు క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే, మాజీ కర్ణాటక స్పిన్నర్ రఘురామ్ భట్‌లు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్నట్టు తేలింది. బీసీసీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్ (విచారణాధికారి) జస్టిస్ ఏపీ షా విచారణలో ఈ విషయం తేటతెల్లమైంది. అయితే మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్‌కు క్లీన్‌చిట్ లభించింది. ముంబై క్రికెట్ సంఘం మేనేజింగ్ కమిటీలో సభ్యునిగా వ్యవహరిస్తున్న ఆమ్రే అటు ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచింగ్ స్టాఫ్‌లోనూ ఉన్నారు.
రఘురామ్ భట్ కర్ణాటక క్రికెట్ సంఘంలో మేనేజింగ్ కమిటీ సభ్యులుగా.. అండర్–16, 14 చైర్మన్‌గా ఉండడంతో పాటు బ్రిజేష్ పటేల్ క్రికెట్ అకాడమీ, ఐడీబీఐ అకాడమీలో పనిచేస్తున్నారు. ఇక ముంబై క్రికెట్ సంఘం ఉపాధ్యక్షుడు, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా ఉన్న వెంగీ పుణేలో క్రికెట్ అకాడమీ నడుపుతున్నారు. తన పదవులు రెండూ గౌరవపూర్వకమైనవేనని ఇచ్చిన వివరణపై షా సంతృప్తి వ్యక్తం చేశారు.