టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (ఫైల్ ఫొటో)
కోల్‌కతా : ఐపీఎల్‌లో సంచలనాలు నమోదు చేసి.. కొత్త రికార్డులు సృష్టిస్తున్న యువ ఆటగాళ్లు రిషభ్ పంత్, ఇషాన్ కిషన్‌లపై టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. ఒక ప్రొడక్ట్‌కు సంబంధించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ.. రిషభ్ పంత్, ఇషాన్ కిషన్‌లు చాలా గొప్పగా ఆడారని ప్రశంసించాడు. వారికి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉందని.. పరిణతితో కూడిన ఆట ద్వారా అవకాశాలు అందిపుచ్చుకుని టీమిండియాలో కీలక ఆటగాళ్లుగా ఎదుగుతారంటూ వ్యాఖ్యానించాడు. ‘పంత్ భవిష్యత్తు ఆశాకిరణం. అతను త్వరలోనే జాతీయ జట్టుకు ఆడతాడు’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఇదే ఆటతీరుతో పాటు నిలకడ ప్రదర్శిస్తే పంత్, ఇషాన్ కిషన్ వంటి యువ కెరటాలు భారత్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఎంతో దూరంలో లేరని తెలిపాడు.
‘పంత్, ఇషాన్ కిషన్‌లకు సమయం వచ్చింది. వాళ్లింకా యువకులే. తొందరపాటు అవసరం లేదు. ఇదే విధంగా ఆడుతూ ఇంకా పరిణతి సాధించాలి. రాబోయే కాలంలో వారు దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కానీ నిలకడ ముఖ్యం. దేశం కోసం ఓ క్రీడాకారుడిని ఎంపిక చేసే ముందు అతను నిలకడగా ఆడుతున్నాడా లేదో చూడటం ముఖ్యం. టి20 భిన్నమైన ఆటే కాదనను కానీ మంచి ప్రదర్శనను కొనసాగిస్తేనే అవకాశాలు వస్తాయి. ప్రస్తుతం ధోని ఉన్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతని స్థానాన్ని భర్తీ చేయడం ఎవరి తరం కాదు. దినేశ్ కార్తీక్ కూడా ఆ స్థానానికి పోటీదారే. శ్రీలంకలో జరిగిన నిదాహాస్ ట్రోఫీలో అతని విలువెంటో చాటుకున్నాడు. అందుకే అతనే ఆ స్థానానికి సరిపోతాడని భావిస్తున్నా’ అని తెలిపాడు.
బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాతీయ జట్టు(ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 మ్యాచ్)లో రిషభ్‌కు స్థానం దక్కకపోవడాన్ని ప్రస్తావించిన గంగూలీ.. కేవలం ఒక మ్యాచ్‌లో ప్రదర్శన ద్వారా జాతీయ జట్టుకు ఎంపికవడం అసాధ్యమని పేర్కొన్నాడు. దేశం తరపున ఆడే అవకాశం రావాలంటే నిలకడతో కూడిన ఆట అవసరమని.. అయితే ప్రస్తుత టీ20 జట్టులో ఈ యువ ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం వారిని నిరాశకు గురి చేసి ఉంటుందని వ్యాఖ్యానించాడు.
సెలక్టర్ల నిర్ణయం సరైందే..
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్ కోసం ఆటగాళ్లను ఎంపిక చేసిన సెలక్టర్ల నిర్ణయాన్ని గంగూలీ సమర్థించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ధోని స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న గంగూలీ.. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన దినేశ్ కార్తీక్‌ను కూడా పక్కన పెట్టే అవకాశం లేదన్నాడు. ఆ కారణంగానే రిషభ్ పంత్‌కు చోటు దక్కలేదని అభిప్రాయపడ్డాడు. కాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ కేవలం 63 బంతుల్లో 128 పరుగులు చేసి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment