సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లి
కోల్‌కతా : నాట్‌వెస్ట్ సిరీస్-2002 గుర్తుందా! ఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించింది. టాప్ ఆర్డర్ విఫలమైన ఈ ఉత్కంఠ పోరులో మహ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) అద్భుత బ్యాటింగ్‌తో భారత్ మ్యాచ్ గెలిచింది. అప్పుడు లార్డ్స్ బాల్కనీలో ఉన్న సారథి గంగూలీ తన చొక్కా విప్పి సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ఈ సీన్ 2019 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి రిపీట్ చేస్తాడని సౌరబ్ గంగూలీ జోస్యం చెప్పాడు. కోల్‌కతాలో జరిగిన ఓ బుక్ రిలీజ్ వేడుకల్లో పాల్గొన్న ఈ స్టార్ ఆటగాళ్లు ఆనాటి రోజులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి కెప్టెన్సీని గంగూలీ ప్రశంసించాడు. జట్టుకు అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నాడని కొనియాడాడు. ఇదే ఊపుతో ఇంగ్లండ్, వేల్స్ జరిగే 2019 ప్రపంచకప్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
ప్రపంచకప్ ట్రోఫీతో కోహ్లి షర్ట్ విప్పెస్తాడు..
‘ఇంగ్లండ్, లార్డ్స్‌లో జరిగే 2019 ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లిసేన గెలుస్తోందని నేను గ్యారెంటీ ఇవ్వగలను. విజయానంతరం ఆనందోత్సాహంలో కోహ్లి నాలాగే షర్ట్ విప్పి ఆక్సఫ్టర్డ్ వీధుల్లో తిరుగుతాడు. ఇప్పుడు ఈ విషయం చెబుతున్నా గుర్తుంచుకోండి.. ఆసమయంలో నేనుంటా.. మీరుంటారు..మన కెమెరాలు కూడా సిద్దంగా ఉంటాయి. అతనికి సిక్స్‌పాక్ కూడా ఉంటది. అప్పడు ఈ విషయంలో నేనేం ఆశ్చర్యపోను. ఇక అతన్ని పాండ్యా సైతం అనుకరిస్తాడని కూడా చెబుతున్నా.. గుర్తుంచుకోండి’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
ఆ ఫైనల్ మ్యాచ్ చూడకుండా నిద్రపోయా: కోహ్లి
నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ చూడకుండా నిద్రపోయినట్లు విరాట్ కోహ్లి గుర్తుచేసుకున్నాడు. ఆ సిరీస్ నాటికి కోహ్లి టినేజ్ కుర్రాడు. ‘ ఆ ఫైనల్ మ్యాచ్‌ను దాదా, వీరు అద్భుతంగా ఆరంభించారు. ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ ఓడగొట్టడం అందులో భారీ లక్ష్యం మన జట్టుకు కష్టమని భావించా. ఇక 150కి 5 వికెట్లు కోల్పోగానే ఆశలు వదులుకుని పడుకున్నా. ఎందుకంటే నేను బాధను తట్టుకోలేను. ఆ అద్భుత విజయం ఓ కలలా అనిపించింది.’ అని కోహ్లి ఆనాటి విశేషాలు పంచుకున్నాడు.
స్వచ్ఛమైన ఫీలింగ్ అది
గంగూలీ చోక్కవిప్పి సంతోషం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. అది ఓ మనిషి స్వచ్చమైన భావోద్వేగమని కోహ్లి అభిప్రాయపడ్డాడు. అది ఎవరకి త్వరగా అర్థంకాదని, తాను కూడా ఇలాంటి ఎమోషన్‌నే వ్యక్తం చేస్తానని కోహ్లి పేర్కొన్నాడు. మైదానంలో దూకుడు వ్యవహరించడం కూడా అలాంటిదేనని, ఓ రోబోలా రాసిచ్చిన స్క్రిప్ట్‌ను, ఎవరో చెప్పినట్లు ఉండలేమన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment