NatWest Trophy finals
-
కోచ్ నన్ను కొట్టాడు.. వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ఆరోపణలు
టీమిండియా మాజీ డాషింగ్ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన ఆరోపణలు చేశాడు. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ సందర్భంగా నాటి భారత హెడ్ కోచ్ జాన్ రైట్ తనను కాలర్ పట్టుకుని, చైర్ పైకి తోసేశాడని బాంబు పేల్చాడు. శ్రీలంకతో మ్యాచ్‌లో తొందరగా ఔటవ్వడంతో రైట్ తన పట్ల అమానవీయంగా వ్యవహరించాడని గుర్తు చేసుకున్నాడు. ఆ సందర్భంలో తనకు పట్టలేని కోపం వచ్చిందని.. ఓ తెల్లోడు మనంపై పెత్తనం చేయడమేంటని జట్టు సభ్యులందరినీ ప్రశ్నించానని.. నాటి టీమ్ మేనేజర్ జోక్యంతో తన కోపం చల్లారిందని ఇటీవల జరిగిన ఓ బుక్ లాంచింగ్ ప్రోగ్రాం సందర్భంగా చెప్పుకొచ్చాడు. ఈ విషయం బయటికి పొక్క కూడదని నాటి భారత బృందం సభ్యులు సచిన్‌కు మాట ఇచ్చారని, అందుకే ఎవరికీ తెలియ లేదని అన్నాడు. ఇలాంటి ఘటనే ఇప్పుడున్న పరిస్థితుల్లో జరిగితే పెద్ద రాద్దాంతం అవుతుందని, ఓ విదేశీ కోచ్ అలా చేస్తే బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపాడు. కాగా, నాటి నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో భారత్.. ఇంగ్లండ్‌ను ఓడించి టైటిల్ గెలిచింది. ఫైనల్లో మహ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) వీరోచితంగా పోరాడి టీమిండియాను గెలిపించారు. కైఫ్ విన్నింగ్ షాట్ కొట్టాక నాటి భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కా విప్పి చేసుకున్న సెలబ్రేషన్స్ ఎప్పటికీ భారత అభిమానులు కళ్ల ముందే మెదులుతూ ఉంటుంది. -
గంగూలీకి అరుదైన గౌరవం.. బ్రిటిష్ పార్లమెంట్లో సత్కారం
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి అరుదైన గౌరవం దక్కింది. 2002 నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా విజయం సాధించి (జులై 13) 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా బ్రిటిష్ పార్లమెంట్ దాదాను సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీనే స్వయంగా వెల్లడించాడు. బ్రిటిష్ పార్లమెంట్ తనను సత్కరించినందుకు గాను ఓ బెంగాలీగా చాలా గర్వపడుతున్నానని తెలిపాడు. ఈ సన్మానం కోసం యూకే ప్రతినిధులు ఆరు నెలల కిందటే తనను సంప్రదించారని వివరించాడు. బ్రిటన్ పార్లమెంట్ ప్రతి ఏడాది ఇలా ఒకరిని సత్కరిస్తుందని, ఈ సారి ఆ అవకాశం తనకు లభించిందని పేర్కొన్నాడు. London, UK | I was felicitated by the British Parliament as a Bengali so it was a nice feeling. It was in the Parliament. They had contacted me six months ago. They do this award every year and I got it: BCCI President Sourav Ganguly pic.twitter.com/Q8k3PdiO2k — ANI (@ANI) July 13, 2022 కాగా, జులై 13 2002లో గంగూలీ నేతృత్వంలోని టీమిండియా నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై సంచలన విజయం నమోదు చేసి ట్రోఫీ ఎగరేసుకుపోయింది. గంగూలీ సేన ఆ చిరస్మరణీయ విజయం సాధించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా జులై 13, 2022న బ్రిటన్ పార్లమెంట్ గంగూలీని గౌరవించింది. ఆ మ్యాచ్‌లో నాటి యువ భారత జట్టు 326 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 3 బంతులుండగానే ఛేదించి చరిత్ర సృష్టించింది. యువరాజ్ సింగ్ (69), మహ్మద్ కైఫ్ (87 నాటౌట్)లు మరపురాని ఇన్నింగ్స్‌ను ఆడి టీమిండియాకు అపురూప విజయాన్ని అందించారు. ఆ మ్యాచ్‌లో కైఫ్ విన్నింగ్ షాట్ కొట్టిన అనంతరం కెప్టెన్ గంగూలీ షర్ట్ విప్పి ప్రదర్శించిన విజయదరహాసం భారత క్రికెట్ అభిమాని మదిలో చిరకాలం మెదులుతూనే ఉంటుంది. నాడు కెప్టెన్‌గా గంగూలీ సాధించిన అద్భుత విజయాన్ని స్మరించుకుంటూ బ్రిటన్ పార్లమెంట్ నిన్న దాదాను సత్కరించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న టీమిండియా రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ ఓడినప్పటికీ.. 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకుంది. అలాగే మూడు వన్డేల సిరీస్‌లోనూ రోహిత్ సేన 1-0లో ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: Sourav Ganguly: అప్పుడు సచిన్, ద్రవిడ్.. నేను! ఇప్పుడు కోహ్లి వంతు! కానీ.. -
యూవీ అవుటవ్వగానే.. గుండెపగిలింది : కైఫ్
నాట్‌వెస్ట్ సిరీస్-2002 గుర్తుందా! ఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించింది. టాప్ ఆర్డర్ విఫలమైన ఈ ఉత్కంఠ పోరులో మహ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) అద్భుత బ్యాటింగ్‌తో భారత్ మ్యాచ్ గెలిచింది. నాట్‌వెస్ట్ సిరీస్ విజయానంతరం అప్పటి కెప్టెన్, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి గ్యాలరీలో సందడి చేయడం ప్రతీ క్రికెట్ అభిమానికి ఓ మధురానుభూతి. నాటి రోజులను ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్‌లో మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్‌లు గుర్తు చేసుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలని అభిమానులతో పంచుకున్నారు. నాడు ఇంగ్లడ్ గడ్డ మీద 326పరుగుల లక్ష్య ఛేదనలో 145 పరుగుకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో భారత్ పడింది. ఆ సమయంలో క్రీజ్‌లో ఉన్న యూవీ, కైఫ్‌లు అద్భుత ప్రదర్శనతో గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువీ ఔటయ్యాడు. ‘యూవీ, నేను క్రీజ్‌లో చివరి వరకు ఉంటే మ్యాచ్ గెలువొచ్చు అనుకున్నా. కానీ, యూవీ అవుటవ్వడంతో ఒక్కసారిగా గుండెపగిలినంత పనయ్యింది. గెలుపు దాదాపు అసాధ్యం అనుకున్నా’ అని నాటి రోజులను కైఫ్ గుర్తు చేసుకున్నారు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బాధ్యతాయుతంగా కైఫ్ బ్యాటింగ్ చేసి, మరో మూడు బంతులు మిగిలుండగానే భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్ ను భారత్‌కు అందించాడు. ఫీల్డింగ్‌లో చిరుతలా కదులుతూ భారత్‌కు మహ్మద్ కైఫ్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని యూవీ ఇన్స్టాగ్రామ్లైవ్ చాట్‌లో పొగడ్తలతో ముంచెత్తాడు. పాయింట్, కవర్లలో తామిద్దరం కలిసి భారత ఫీల్డింగ్ విభాగంలో ఒక కొత్త సరళిని తీసుకొచ్చామన్నారు. ఇప్పుడున్న భారత జట్టులో మంచి ఫీల్డర్లున్నారని, కానీ భారత జట్టు ఫీల్డింగ్‌లో ఓ కొత్త ఒరవడి మాత్రం తామే తీసుకొచ్చామని నవ్వుతూ యూవీ చెప్పారు. -
లక్ష్మణ్ వద్దన్నా చేసా: గంగూలీ
హైదరాబాద్ : నాట్‌వెస్ట్ సిరీస్ విజయానంతరం అప్పటి కెప్టెన్, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి గ్యాలరీలో సందడి చేయడం ప్రతీ క్రికెట్ అభిమానికి ఓ మధురానుభూతి. ఆ సమయంలో షర్ట్ విప్పొద్దని మాజీ క్రికెటర్, హైదారాబాదీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఎంత చెప్పినా వినలేదని గంగూలీ బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో పేర్కొన్నాడు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. ‘ఆ సమయంలో నా వెనక హర్భజన్, ఎడమ వైపు లక్ష్మణ్ ఉన్నారు. విజయానంతరం సంతోషంతో నేను నా టీషర్ట్‌ను విప్పుతున్నాను. ఈ సమయంలో లక్ష్మణ్ వద్దు.. వద్దు అని సూచించాడు. అయిన వినకుండా నేను నాషర్ట్ తీసేసాను. అప్పుడు లక్ష్మణ్ నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగాడు. దానికి నువ్వు కూడా షర్ట్ తీసేయని చెప్పాను’ అని గంగూలీ నాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ఫ్లింటాఫ్ను చూసే.. అయితే ఇలా షర్ట్ విప్పి సెలెబ్రేషన్ చేయాలనుకున్నది మాత్రం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ను చూసేనని గంగూలీ తెలిపాడు. ఓ వన్డే సిరీస్ డ్రా అయిన సందర్భంగా ఫ్లింటాఫ్ వాంఖడే స్టేడియంలో షర్ట్ తీసేసీ హల్చల్ చేశాడు. లార్డ్స్‌లో గెలిస్తే తను కూడా ఇలా చేయాలని అప్పుడే అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ ఈ ఘటనపై నా కూతురు సనా..‘షర్ట్ విప్పడం క్రికెట్లో తప్పని సరా? నీవు ఎందుకు అలా చేశావు’ అని అడిగిన ప్రశ్నకు చాలా ఇబ్బందికి గురయ్యానన్నాడు. అలా ఒకసారి తప్పు జరిగిపోయిందని, జీవితంలో కొన్నిసార్లు మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేమని ఆమెకు తెలిపినట్లు పేర్కొన్నాడు. 311 వన్డేలాడిన గంగూలీ 11363 పరుగులు చేశాడు. -
‘టీమిండియా జాంటీ రోడ్స్’ వీడ్కోలు
హైదరాబాద్: టీమిండియా టార్గెట్ 326.. కానీ 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలువగా.. యువరాజ్-మహ్మద్ కైఫ్‌ల జోడి టీమిండియాను విజయతీరాలకు చేర్చి గంగూలీ చొక్కా విప్పి సంతోషపడేలా చేసిన చారిత్రక రోజు నేడు(జులై13). ఇంగ్లండ్‌పై భారత్ నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచి నేటికి 16 సంవత్సరాలు. ఈ శుభదినం రోజున ఆనాటి హీరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 12 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన కైఫ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించిన రోజునే రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. టీమిండియా జెర్సీ ధరించడం ఎంతో గౌరవంగా భావించా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ బోర్డ్ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరీలకు మెయిల్ పంపించాడు. టీమిండియా జాంటీరోడ్స్ ఫీల్డింగ్‌లో చిరుతలా కదులుతూ భారత్‌కు మహ్మద్ కైఫ్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. యువరాజ్‌తో కలిసి పాయింట్లో ఫీల్డింగ్ చేస్తూ ఎన్నో మెరుపులాంటి క్యాచ్‌లు, రనౌట్లు చేసిన ఘనత ఈ ఆటగాడిది. అభిమానులు కైఫ్‌ను ‘టీమిండియా జాంటీ రోడ్స్’గా పిలుచుకుంటారు. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు అరంగేట్రం చేసిన కైఫ్, వన్డేల్లో 2002లో ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడాడు. కెరీర్ మధ్యలో బ్యాటింగ్‌లో విఫలమైనా గంగూలీ ప్రోత్సాహంతో నెట్టుకొచ్చాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ చివరి టెస్ట్ 2006లో వెస్టీండీస్‌పై, చివరి వన్డే దక్షిణాఫ్రికాపై ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ చేరడంలో ఈ క్రికటర్ పాత్ర మరువలేనిది. రికార్డులు.. టీమిండియా తొలిసారి అండర్-19 ప్రపంచకప్(2000) గెలుచుకుంది కైఫ్ సారథ్యంలోనే. భారత్ తరుపున 125 వన్డేల్లో 2753 పరుగులు, 13 టెస్టుల్లో 624 పరుగులు సాధించాడు. వీటిలో మూడు సెంచరీలు, ఇరవై అర్దసెంచరీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోహించిన కైఫ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 186 మ్యాచ్‌లు ఆడి పదివేలకు పైగా పరుగులు సాధించాడు. వీటిలో 19 శతకాలు, 59 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ప్రస్తుతం రంజీల్లో ఛత్తీస్‌గఢ్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్ల తరుపున ప్రాతినిథ్యం వహించాడు. -
కోహ్లి పక్కా నాలా షర్ట్ విప్పి తిరుగుతాడు: గంగూలీ
కోల్‌కతా : నాట్‌వెస్ట్ సిరీస్-2002 గుర్తుందా! ఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా 326 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి చరిత్ర సృష్టించింది. టాప్ ఆర్డర్ విఫలమైన ఈ ఉత్కంఠ పోరులో మహ్మద్ కైఫ్ (87), యువరాజ్ సింగ్ (69) అద్భుత బ్యాటింగ్‌తో భారత్ మ్యాచ్ గెలిచింది. అప్పుడు లార్డ్స్ బాల్కనీలో ఉన్న సారథి గంగూలీ తన చొక్కా విప్పి సంతోషం వ్యక్తం చేశాడు. అయితే ఈ సీన్ 2019 ప్రపంచకప్‌లో టీమిండియా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి రిపీట్ చేస్తాడని సౌరబ్ గంగూలీ జోస్యం చెప్పాడు. కోల్‌కతాలో జరిగిన ఓ బుక్ రిలీజ్ వేడుకల్లో పాల్గొన్న ఈ స్టార్ ఆటగాళ్లు ఆనాటి రోజులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లి కెప్టెన్సీని గంగూలీ ప్రశంసించాడు. జట్టుకు అండగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నాడని కొనియాడాడు. ఇదే ఊపుతో ఇంగ్లండ్, వేల్స్ జరిగే 2019 ప్రపంచకప్ గెలుస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. ప్రపంచకప్ ట్రోఫీతో కోహ్లి షర్ట్ విప్పెస్తాడు.. ‘ఇంగ్లండ్, లార్డ్స్‌లో జరిగే 2019 ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లిసేన గెలుస్తోందని నేను గ్యారెంటీ ఇవ్వగలను. విజయానంతరం ఆనందోత్సాహంలో కోహ్లి నాలాగే షర్ట్ విప్పి ఆక్సఫ్టర్డ్ వీధుల్లో తిరుగుతాడు. ఇప్పుడు ఈ విషయం చెబుతున్నా గుర్తుంచుకోండి.. ఆసమయంలో నేనుంటా.. మీరుంటారు..మన కెమెరాలు కూడా సిద్దంగా ఉంటాయి. అతనికి సిక్స్‌పాక్ కూడా ఉంటది. అప్పడు ఈ విషయంలో నేనేం ఆశ్చర్యపోను. ఇక అతన్ని పాండ్యా సైతం అనుకరిస్తాడని కూడా చెబుతున్నా.. గుర్తుంచుకోండి’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఆ ఫైనల్ మ్యాచ్ చూడకుండా నిద్రపోయా: కోహ్లి నాట్ వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్ చూడకుండా నిద్రపోయినట్లు విరాట్ కోహ్లి గుర్తుచేసుకున్నాడు. ఆ సిరీస్ నాటికి కోహ్లి టినేజ్ కుర్రాడు. ‘ ఆ ఫైనల్ మ్యాచ్‌ను దాదా, వీరు అద్భుతంగా ఆరంభించారు. ఇంగ్లండ్ గడ్డపై ఇంగ్లండ్ ఓడగొట్టడం అందులో భారీ లక్ష్యం మన జట్టుకు కష్టమని భావించా. ఇక 150కి 5 వికెట్లు కోల్పోగానే ఆశలు వదులుకుని పడుకున్నా. ఎందుకంటే నేను బాధను తట్టుకోలేను. ఆ అద్భుత విజయం ఓ కలలా అనిపించింది.’ అని కోహ్లి ఆనాటి విశేషాలు పంచుకున్నాడు. స్వచ్ఛమైన ఫీలింగ్ అది గంగూలీ చోక్కవిప్పి సంతోషం వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. అది ఓ మనిషి స్వచ్చమైన భావోద్వేగమని కోహ్లి అభిప్రాయపడ్డాడు. అది ఎవరకి త్వరగా అర్థంకాదని, తాను కూడా ఇలాంటి ఎమోషన్‌నే వ్యక్తం చేస్తానని కోహ్లి పేర్కొన్నాడు. మైదానంలో దూకుడు వ్యవహరించడం కూడా అలాంటిదేనని, ఓ రోబోలా రాసిచ్చిన స్క్రిప్ట్‌ను, ఎవరో చెప్పినట్లు ఉండలేమన్నాడు. -
30 పరుగులు చేస్తే సెంచరీ చేసినట్లే..
సరిగ్గా 14 ఏళ్ల కిందట గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు సంచలనం సృష్టించింది. జూలై 13, 2002లో నాట్ వెట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్ ను వారి సొంతగడ్డపై ఓడించిన క్షణాలను టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. మ్యాచ్ చివరి 90 నిమిషాలే క్రికెటర్ గా తనకు లైఫ్ ఇచ్చాయని, కెరీర్ లో ఇదే తనకు అత్యుత్తమ ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. సిరీస్ గెలిచిన అనంతరం లార్డ్స్ మైదానం డ్రెస్సింగ్ రూములో గంగూలీ షర్ట్ విప్పి గాల్లో తిప్పడం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నాసిర్ హుస్సేన్(115), ట్రెస్కోథిక్(109) సెంచరీలతో కదం తొక్కడంతో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి భారత్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లుగా సెహ్వాగ్, కెప్టెన్ గంగూలీ క్రీజులో దిగారు. 14.3 ఓవర్లలో ఈ జోడీ 106 పరుగులు చేశాక గంగూలీ(60) ఔటయ్యాడు. ఆ తర్వాత భారత్ వెనువెంటనే వికెట్లు చేజార్చుకుంది. 24 ఓవర్లలో 146 పరుగులు చేసి ఓటమికి చేరువైంది. గైల్స్ బౌలింగ్ లో సచిన్(14) బౌల్డయ్యాడు. యువరాజ్, తాను క్రీజులో ఉన్నామని, అయితే గెలుపు గురించి కంటే కూడా ఓటమి అంతరాన్ని తగ్గించడంపైనే దృష్టిపెట్టానని కైఫ్ చెప్పాడు. అయితే గంగూలీ చెప్పిన మాటలు తనకు గుర్తొచ్చాయని... ఈ స్థానంలో బ్యాటింగ్ కు దిగి 30 బంతుల్లో 30 పరుగులు చేసినా ఓపెనర్ సెంచరీకి సమానం అని ఎంకరేజ్ చేశాడన్నాడు. యువరాజ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తుంటే తాను స్ట్రైక్ రొటేట్ చేశానని, అయితే 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువీ ఔటయ్యాడు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ అసాధ్యమనిపించినా, మరో మూడు బంతులు మిగిలుండగా విజయాన్ని సాధించినట్లు వివరించాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్ ను భారత్‌కు అందించాడు.