హైదరాబాద్: టీమిండియా టార్గెట్ 326.. కానీ 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలువగా.. యువరాజ్-మహ్మద్ కైఫ్‌ల జోడి టీమిండియాను విజయతీరాలకు చేర్చి గంగూలీ చొక్కా విప్పి సంతోషపడేలా చేసిన చారిత్రక రోజు నేడు(జులై13). ఇంగ్లండ్‌పై భారత్ నాట్‌వెస్ట్ సిరీస్ గెలిచి నేటికి 16 సంవత్సరాలు. ఈ శుభదినం రోజున ఆనాటి హీరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
12 సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన కైఫ్ టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించిన రోజునే రిటైర్మెంట్ ప్రకటించాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. టీమిండియా జెర్సీ ధరించడం ఎంతో గౌరవంగా భావించా. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ బోర్డ్ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కార్యదర్శి అమితాబ్ చౌదరీలకు మెయిల్ పంపించాడు.
టీమిండియా జాంటీరోడ్స్
ఫీల్డింగ్‌లో చిరుతలా కదులుతూ భారత్‌కు మహ్మద్ కైఫ్ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. యువరాజ్‌తో కలిసి పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఎన్నో మెరుపులాంటి క్యాచ్‌లు, రనౌట్‌లు చేసిన ఘనత ఈ ఆటగాడిది. అభిమానులు కైఫ్‌ను ‘టీమిండియా జాంటీ రోడ్స్’గా పిలుచుకుంటారు. 2000 సంవత్సరంలో దక్షిణాఫ్రికాపై తొలి టెస్టు అరంగేట్రం చేసిన కైఫ్, వన్డేల్లో 2002లో ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్ ఆడాడు. కెరీర్ మధ్యలో బ్యాటింగ్‌లో విఫలమైనా గంగూలీ ప్రోత్సాహంతో నెట్టుకొచ్చాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ చివరి టెస్ట్ 2006లో వెస్టీండీస్‌పై, చివరి వన్డే దక్షిణాఫ్రికాపై ఆడాడు. 2003 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ చేరడంలో ఈ క్రికటర్ పాత్ర మరువలేనిది.
రికార్డులు.. టీమిండియా తొలిసారి అండర్-19 ప్రపంచకప్(2000) గెలుచుకుంది కైఫ్ సారథ్యంలోనే. భారత్ తరుపున 125 వన్డేల్లో 2753 పరుగులు, 13 టెస్టుల్లో 624 పరుగులు సాధించాడు. వీటిలో మూడు సెంచరీలు, ఇరవై అర్దసెంచరీలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రంజీ ట్రోఫీ గెలవడంలో కీలకపాత్ర పోహించిన కైఫ్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 186 మ్యాచ్‌లు ఆడి పదివేలకు పైగా పరుగులు సాధించాడు. వీటిలో 19 శతకాలు, 59 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం. ప్రస్తుతం రంజీల్లో ఛత్తీస్‌గఢ్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్ల తరుపున ప్రాతినిథ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment