30 పరుగులు చేస్తే సెంచరీ చేసినట్లే..
30 పరుగులు చేస్తే సెంచరీ చేసినట్లే..
Published Wed, Jul 13 2016 8:32 PM | Last Updated on Mon, Sep 4 2017 4:47 AM
సరిగ్గా 14 ఏళ్ల కిందట గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు సంచలనం సృష్టించింది. జూలై 13, 2002లో నాట్ వెట్ సిరీస్ ఫైనల్లో ఇంగ్లండ్ ను వారి సొంతగడ్డపై ఓడించిన క్షణాలను టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ మరోసారి గుర్తుచేసుకున్నాడు. ఫైనల్ మ్యాచ్ విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. మ్యాచ్ చివరి 90 నిమిషాలే క్రికెటర్ గా తనకు లైఫ్ ఇచ్చాయని, కెరీర్ లో ఇదే తనకు అత్యుత్తమ ఇన్నింగ్స్ అని పేర్కొన్నాడు. సిరీస్ గెలిచిన అనంతరం లార్డ్స్ మైదానం డ్రెస్సింగ్ రూములో గంగూలీ షర్ట్ విప్పి గాల్లో తిప్పడం క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోరు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నాసిర్ హుస్సేన్(115), ట్రెస్కోథిక్(109) సెంచరీలతో కదం తొక్కడంతో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసి భారత్ కు భారీ టార్గెట్ నిర్దేశించింది. ఓపెనర్లుగా సెహ్వాగ్, కెప్టెన్ గంగూలీ క్రీజులో దిగారు. 14.3 ఓవర్లలో ఈ జోడీ 106 పరుగులు చేశాక గంగూలీ(60) ఔటయ్యాడు. ఆ తర్వాత భారత్ వెనువెంటనే వికెట్లు చేజార్చుకుంది. 24 ఓవర్లలో 146 పరుగులు చేసి ఓటమికి చేరువైంది. గైల్స్ బౌలింగ్ లో సచిన్(14) బౌల్డయ్యాడు. యువరాజ్, తాను క్రీజులో ఉన్నామని, అయితే గెలుపు గురించి కంటే కూడా ఓటమి అంతరాన్ని తగ్గించడంపైనే దృష్టిపెట్టానని కైఫ్ చెప్పాడు.
అయితే గంగూలీ చెప్పిన మాటలు తనకు గుర్తొచ్చాయని... ఈ స్థానంలో బ్యాటింగ్ కు దిగి 30 బంతుల్లో 30 పరుగులు చేసినా ఓపెనర్ సెంచరీకి సమానం అని ఎంకరేజ్ చేశాడన్నాడు. యువరాజ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తుంటే తాను స్ట్రైక్ రొటేట్ చేశానని, అయితే 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద యువీ ఔటయ్యాడు. అప్పటికీ 59 పరుగుల లక్ష్యం భారత్ ముందు ఉంది. టెయిలెండర్లతో కలిసి బ్యాటింగ్ అసాధ్యమనిపించినా, మరో మూడు బంతులు మిగిలుండగా విజయాన్ని సాధించినట్లు వివరించాడు. భారత్ 8 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. కైఫ్ 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్ ను భారత్కు అందించాడు.
Advertisement