సౌరవ్ గంగూలీ
హైదరాబాద్ : నాట్‌వెస్ట్ సిరీస్ విజయానంతరం అప్పటి కెప్టెన్, టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ షర్ట్ విప్పి గ్యాలరీలో సందడి చేయడం ప్రతీ క్రికెట్ అభిమానికి ఓ మధురానుభూతి. ఆ సమయంలో షర్ట్ విప్పొద్దని మాజీ క్రికెటర్, హైదారాబాదీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఎంత చెప్పినా వినలేదని గంగూలీ బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్ షోలో పేర్కొన్నాడు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ.. పలు ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు.
‘ఆ సమయంలో నా వెనక హర్భజన్, ఎడమ వైపు లక్ష్మణ్ ఉన్నారు. విజయానంతరం సంతోషంతో నేను నా టీషర్ట్‌ను విప్పుతున్నాను. ఈ సమయంలో లక్ష్మణ్ వద్దు.. వద్దు అని సూచించాడు. అయిన వినకుండా నేను నాషర్ట్ తీసేసాను. అప్పుడు లక్ష్మణ్ నేనేం చేయాలి ఇప్పుడు అని అడిగాడు. దానికి నువ్వు కూడా షర్ట్ తీసేయని చెప్పాను’ అని గంగూలీ నాటి మధుర క్షణాలను గుర్తుచేసుకున్నాడు.
ఫ్లింటాఫ్‌ను చూసే..
అయితే ఇలా షర్ట్ విప్పి సెలెబ్రేషన్ చేయాలనుకున్నది మాత్రం ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను చూసేనని గంగూలీ తెలిపాడు. ఓ వన్డే సిరీస్ డ్రా అయిన సందర్భంగా ఫ్లింటాఫ్ వాంఖడే స్టేడియంలో షర్ట్ తీసేసీ హల్‌చల్ చేశాడు. లార్డ్స్‌లో గెలిస్తే తను కూడా ఇలా చేయాలని అప్పుడే అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ ఈ ఘటనపై నా కూతురు సనా..‘షర్ట్ విప్పడం క్రికెట్‌లో తప్పని సరా? నీవు ఎందుకు అలా చేశావు’ అని అడిగిన ప్రశ్నకు చాలా ఇబ్బందికి గురయ్యానన్నాడు. అలా ఒకసారి తప్పు జరిగిపోయిందని, జీవితంలో కొన్నిసార్లు మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేమని ఆమెకు తెలిపినట్లు పేర్కొన్నాడు. 311 వన్డేలాడిన గంగూలీ 11363 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment