'పాక్‌లో టీమిండియా వద్ద ఒక్కపైసా తీసుకోలేదు' | Sourav, Inzamam urge resumption of India Pakistan series | Sakshi
Sakshi News home page

'పాక్‌లో టీమిండియా వద్ద ఒక్కపైసా తీసుకోలేదు'

Published Mon, Mar 7 2016 7:02 PM | Last Updated on Sun, Sep 3 2017 7:12 PM

'పాక్‌లో టీమిండియా వద్ద ఒక్కపైసా తీసుకోలేదు'

'పాక్‌లో టీమిండియా వద్ద ఒక్కపైసా తీసుకోలేదు'

న్యూఢిల్లీ: సౌరవ్ గంగూలీ, ఇంజమాముల్ హక్‌.. బద్ధ విరోధులైన భారత్‌-పాకిస్థాన్ క్రికెట్‌ జట్లకు ఒకప్పుడు ఒకేసారి నేతృత్వం వహించిన కెప్టెన్లు. ఈ ఇద్దరు తాజాగా ఓ టీవీ చానెల్ నిర్వహించిన క్రికెట్‌ షోలో మనస్సు విప్పి మాట్లాడారు. భారత్‌-పాకిస్థాన్‌ ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్‌ను పునరుద్ధరించాలని, ఇది ఇరుదేశాల సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని చెప్పారు. తాము క్రికెట్ ఆడుతున్న రోజుల్లో భారత్‌-పాక్ మ్యాచులప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.  హక్‌ మాట్లాడుతూ 'భారత్‌-పాక్ క్రికెట్ సిరీస్‌లు మళ్లీ జరగాలి. క్రికెట్ సంబంధాలు ఇరుదేశాలకు మేలు చేస్తాయి. ఇరుదేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పడేందుకు దోహదం చేస్తాయి. ఇరుదేశాల ప్రజలు కూడా క్రికెట్‌ మ్యాచులు జరగాలని కోరుకుంటున్నారు. వాళ్లు క్రికెటర్లను, క్రికెట్ ఆటను ఎంతగానో ఆస్వాదిస్తారు' అని చెప్పాడు.

'రెండు దేశాల ప్రజల మధ్య ఎంతో సోదరభావం ఉంది. 2004లో భారత జట్టు పాకిస్థాన్‌కు వచ్చినప్పుడు.. వారు పలు హోటళ్లలో, రెస్టారెంట్లలో తిన్నారు. కానీ ఎవ్వరు కూడా వారి నుంచి డబ్బు తీసుకోలేదు. భారత క్రికెటర్లు షాపింగ్ వెళ్లినప్పుడు కూడా పాక్ ఆటగాళ్లు వెంట ఉండేవారు. వారికి ప్రాంతాలన్నీ తిరిగి చూపించేవారు. దుకాణదారులు కూడా వారి నుంచి పైసా తీసుకోలేదు' అని హాక్‌ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ధర్మశాలలో భారత్‌-పాక్‌ టీ-20 మ్యాచు గురించి ఇమ్రాన్‌ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించిన హక్‌.. అక్కడ మ్యాచ్ జరుగాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. గంగూలీ మాట్లాడుతూ దాయాది పాక్‌తో క్రికెట్‌ ఆడటం ఎప్పుడూ ఆనందంగానే ఉండేదని, అప్పట్లో తమ రెండు జట్లు ప్రపంచంలో ఉత్తమ జట్లుగా ఉండటంతో ఆట పోటాపోటీగా ఉండేదని చెప్పాడు.

'వ్యక్తిగతంగా వారితో మాకు శత్రుత్వం ఉండేది కాదు. కానీ రెండు జట్లు ఆడినప్పుడు బలమైన పోటీతత్వం మాత్రం ఉండేది. పాక్‌కు బలమైన లైనప్‌ ఉంది. ఇంజీ కూడా బాగా ఆడేవాడు. ఇజాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్, షాహిద్ ఆఫ్రిది, మొయిన్ ఖాన్‌ వంటి బలమైన బ్యాట్స్‌మెన్‌ ఉండేవారు. ప్రపంచంలోనే ఉత్తమ ఫాస్ట్‌ బౌలర్లు వాళ్ల జట్టులో ఉండేవారు. ఆ జట్టులో బలహీనత కనిపెట్టడం చాలా కష్టంగా ఉండేది. వాళ్లతో ఆడటం ఎప్పుడూ గొప్ప అనుభూతిని ఇచ్చేది' అని గంగూలీ చెప్పాడు.

'నా కెప్టెన్సీ కెరీరంతా పాక్‌ కెప్టెన్‌గా ఇంజీ భాయే ఉన్నాడు. నేను ఆయన బ్యాటింగ్‌కు అభిమానిని. 2004 భారత్-పాక్‌ సిరీస్‌ నాకు ఇంకా గుర్తుంది. ఆయనను ఔట్‌ చేయడం మాకు ఎంతో కష్టంగా అనిపించేంది. కరాచీలో జరిగిన మొదటి వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన మేం 340కిపైచిలుకు పరుగులు చేశాం. పాక్‌ 40 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. మేం గెలుస్తామని భావించాం. కానీ ఇంజీ వచ్చి మ్యాచ్‌ గతిని మార్చాడు. చివరి ఓవర్‌లో మొయిన్‌ ఖాన్‌ కొన్ని పరుగులు చేసినా మేం ఆ మ్యాచులో ఓడిపోయేవాళ్లమే' అని గంగూలీ చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement