అంపైర్లపై ఏబీ ఆగ్రహం..
సౌంతాంప్టన్:ఏబీ డివిలియర్స్.. దక్షిణాఫ్రికా విధ్వంసకర బ్యాట్స్మనే కాదు, మైదానంలో కూల్ గా నవ్వుతూ కనిపించే ఆటగాడు. అయితే శనివారం ఇంగ్లండ్ తో రెండో వన్డే సందర్బంగా ఏబీకి పట్టలేనంత కోపం వచ్చింది. అనవసరంగా దక్షిణాఫ్రికా జట్టును బాల్ ట్యాంపరింగ్ వివాదంలో ఇరికించే యత్నం జరగడంతో ఏబీ తీవ్రంగా స్పందించాడు. తాము ఏ తప్పు చేయకపోయినా బాల్ ట్యాంపరింగ్ వివాదం అంటగట్టడం ఏమిటని అంపైర్లను నిలదీశాడు.
అసలు ఏం జరిగిందంటే..ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో భాగంగా 33 వ ఓవర్ ముగిసిన తరువాత బంతి ట్యాంపరింగ్ అంశంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ తో ఫీల్డ్ అంపైర్లు రాబ్ బైలీ, క్రిస్ గఫానీలు చర్చించారు. బంతిపై ఉన్న లెదర్ తొలగించబడి ఉండటంతో అనుమానం వచ్చిన అంపైర్లు ఏబీని నిలదీశారు. దక్షిణాఫ్రికా జట్టు ట్యాంపరింగ్ చేసిందనే అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఏబీకి తీవ్ర కోపం వచ్చింది. అసలు ఎటువంటి ఆధారాలు లేకుండా తమ జట్టుపై అపనింద వేయడమేమిటని ప్రశ్నించాడు. ఈ క్రమంలోనే అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. గత ఆరు నెలల క్రితం ఆసీస్ తో మ్యాచ్ సందర్బంగా దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డు ప్లెసిస్ పై టాంపరింగ్ ఆరోపణలు చేసిన విషయాన్ని ఏబీ మరోసారి ప్రస్తావించాడు.
'దాదాపు దక్షిణాఫ్రికా జట్టు ట్యాంపరింగ్ పాల్పడిందనే నిందను వేయడానికి యత్నించారు. ఇక్కడ నా జట్టును కాపాడుకోవడమనేది నా విధి. ఎటువంటి పొరపాటు చేయకపోయినా మమ్ముల్ని ఇరికించే యత్నమైతే జరిగిందనేది నాకు అనిపించింది. దాంతో అంపైర్లతో తీవ్రంగా వాగ్వాదం చేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో బంతి సరిగా లేనప్పుడు దానికున్న లెదర్ ఊడిపోతుంది. ఆ విషయాన్ని అంపైర్ల దృష్టికి తీసుకెళ్లాను. అయితే అంపైర్లు నా వాదనతో ఏకీభవించలేదు. మరొకవైపు మేము టాంపరింగ్ కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు. కాకపోతే ఇక్కడ మేము అమాయకులం అనేది చివరకు తేలింది. మేము టాంపరింగ్ చేసినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదు'అని ఏబీ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ రెండు పరుగుల తేడాతో గెలిచి వన్డే సిరీస్ ను గెలుచుకున్న సంగతి తెలిసిందే.