సెమీస్‌లో సఫారీ
ఇంగ్లండ్‌పై విజయం
రాణించిన డివిలియర్స్
టి20 ప్రపంచకప్
చిట్టగాంగ్: ఏబీ డివిలియర్స్ (28 బంతుల్లో 69 నాటౌట్; 9 ఫోర్లు; 3 సిక్స్) మెరుపు బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికా జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. టి20 ప్రపంచకప్ గ్రూప్ ‘1’లో భాగంగా ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3 పరుగుల తేడాతో నెగ్గింది. మరోవైపు ఈనెల 31న శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ విజేత మరో సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ఇక ఇంగ్లండ్ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను నెదర్లాండ్స్‌పై గెలిచినా ఫలితం ఉండదు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసింది.
ఈ టోర్నీలో ఇప్పటిదాకా ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (37 బంతుల్లో 56; 6 ఫోర్లు; 2 సిక్స్), డి కాక్ (33 బంతుల్లో 29; 2 ఫోర్లు) జట్టుకు శుభారంభాన్ని అందించి తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. అనంతరం స్వల్ప వ్యవధిలో మరో రెండు వికెట్లు పడినా మిల్లర్ (15 బంతుల్లో 19; 2 ఫోర్లు; 1 సిక్స్)తో కలిసి డివిలియర్స్ జట్టు స్కోరును పరిగెత్తించాడు. చివర్లో మరింత రెచ్చిపోయి డివిలియర్స్ బౌండరీల వరద పారించడంతో 4 ఓవర్లలోనే జట్టు 68 పరుగులు పిండుకుంది.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు ప్రయత్నించిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 193 పరుగులు చేసి ఓడింది.
అలెక్స్ హేల్స్ (22 బంతుల్లో 38; 6 ఫోర్లు; 1 సిక్స్) కాసేపు మెరుపులు మెరింపించినా వేన్ పార్నెల్ (3/31) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. హేల్స్‌తోపాటు మొయిన్ అలీని వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత బట్లర్ (24 బంతుల్లో 34; 2 ఫోర్లు; 1 సిక్స్), బొపారా (18 బంతుల్లో 31; 3 ఫోర్లు; 1 సిక్స్) కాసేపు పోరాడినా ఫలితం దక్కలేదు. చివరి ఓవర్‌లో బ్రెస్నన్ (4 బంతుల్లో 17 నాటౌట్; 1 ఫోర్; 2 సిక్స్) 6, 4, 6తో చెలరేగి పరాజయం తేడా తగ్గించగలిగాడు.
సంక్షిప్త స్కోర్లు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 196/5 (20 ఓవర్లలో) (డివిలియర్స్ 69 నాటౌట్, ఆమ్లా 56, జోర్డాన్ 1/30, ట్రెడ్‌వెల్ 1/25, బ్రాడ్ 1/33); ఇంగ్లండ్ ఇన్నింగ్స్: 193/7 (20 ఓవర్లలో) (హేల్స్ 38, బట్లర్ 34, బొపారా 31, పార్నెల్ 3/31, తాహిర్ 2/27).