శతకాలతో చితకొట్టేశారు!
ముంబై: టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా చివరిదైన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా పరుగుల మోత మోగించింది. ఓపెనర్ డీ కాక్, డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లు దూకుడుగా ఆడి శతకాలతో పరుగుల వరద పారించారు. డీ కాక్(109; 87 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్(133;115 బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు), డివిలియర్స్(119;6 బంతుల్లో 3 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీల నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. దీంతో పాటు ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీల చేసిన అరుదైన రికార్డును దక్షిణాఫ్రికా రెండోసారి తనఖాతాలో వేసుకుంది..
టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఆదినుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్ హషీమ్ ఆమ్లా(23) తొలి వికెట్ ను కోల్పోయిన అనంతరం డీ కాక్ తో కలిసిన డు ప్లెసిస్ దాటి బ్యాటింగ్ చేశాడు. వారిద్దరూ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడి రెండో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలోనే డీ కాక్ రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన ఏబీ డివిలియర్స్ తో డు ప్లెసిస్ జతకలిశాడు. వీరిద్దరూ కూడా ధోని సేనకు చుక్కలు చూపించారు. తొలుత డు ప్లెసిస్ సెంచరీ చేయగా, అనంతరం డివిలియర్స్ కూడా సెంచరీ మార్కును చేరాడు.
వీరిద్దరూ కలిసి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో దక్షిణాఫ్రికా 44 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 351పరుగులు చేసింది. కాగా, ఆ సమయంలో డు ప్లెసిస్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరాడు. అటు తరువాత దక్షిణాఫ్రికా మరో 47 పరుగులు చేశాక డివిలియర్స్ మూడో వికెట్ రూపంలో అవుటయ్యాడు. చివర్లో బెహర్దియన్(22 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో దక్షిణాఫ్రికా 439 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, హర్భజన్ సింగ్, రైనాలకు తలో వికెట్ దక్కింది.