'మూడు' చెరువులు నీళ్లు తాగించారు
సఫారీలు సింహనాదం చేశారు... ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు బ్యాట్స్‌మెన్ శతకాల మోత మోగించారు. వాంఖడే మైదానం దద్దరిల్లేలా భారత జట్టు భరతం పట్టారు. ఏకంగా 438 పరుగులతో భారత గడ్డపై చరిత్రను తిరగరాసిన దక్షిణాఫ్రికా మ్యాచ్‌తో పాటు సిరీస్‌నూ తమ ఖాతాలో వేసుకుంది.
డివిలియర్స్, డు ప్లెసిస్, డి కాక్... ఈ ‘డి’ గ్యాంగ్ టీమిండియాకు భారీ గాయం చేసింది. ఫోర్లు, సిక్సర్లు బాదడంలో వీరంతా పోటీ పడుతూ భారత బౌలర్లకు మూడు చెరువుల నీళ్లు తాగించారు. ఒక రకమైన కసితో పరుగుల వరద పారించిన దక్షిణాఫ్రికాకు ఎదురులేని విజయం దక్కింది.
ప్రత్యర్థి బ్యాటింగ్ దెబ్బకు మన బౌలర్లు ఏమీ చేయలేక చేతులెత్తేసిన వేళ... పరుగులు ఇవ్వడంలో భువనేశ్వర్ సెంచరీ దాటేయగా, మిగతా వారు దాదాపుగా అలాంటి ప్రదర్శనే ఇచ్చారు. అనంతరం రహానే, ధావన్ మెరుపులు ఓ దశలో ఆశలు రేపినా... చివరకు దారుణ భంగపాటు తప్పలేదు.
చివరి వన్డేలో దక్షిణాఫ్రికా ఘన విజయం
* 214 పరుగులతో భారత్ చిత్తు చిత్తు
* మ్యాచ్‌లో రికార్డుల వెల్లువ
* డు ప్లెసిస్, డివిలియర్స్, డి కాక్ సెంచరీలు
* సిరీస్ 3-2తో సఫారీల సొంతం
ముంబై: సంచలన బ్యాటింగ్ ప్రదర్శనతో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. రికార్డులు వెల్లువెత్తిన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 214 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 4 వికెట్లకు 438 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (115 బంతుల్లో 133 రిటైర్డ్ హర్ట్; 9 ఫోర్లు, 6 సిక్సర్లు), డివిలియర్స్ (61 బంతుల్లో 119; 3 ఫోర్లు, 11 సిక్సర్లు), డి కాక్ (87 బంతుల్లో 109; 17 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలతో చెలరేగారు. రెండో వికెట్‌కు డు ప్లెసిస్, డి కాక్ 154 పరుగులు జోడించగా...
మూడో వికెట్‌కు డు ప్లెసిస్, డివిలియర్స్ ఏకంగా 10.63 రన్‌రేట్‌తో 211 పరుగులు జత చేయడం ఇన్నింగ్స్‌లో హైలైట్. ఆ తర్వాత భారత్ 36 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. అజింక్య రహానే (58 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శిఖర్ ధావన్ (59 బంతుల్లో 60; 8 ఫోర్లు) మాత్రమే కొంత పోరాడగలిగారు. రబడ 4, స్టెయిన్ 3 వికెట్లు తీశారు. తాజా ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌ను డివిలియర్స్ బృందం 3-2తో సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లో వన్డే సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. డి కాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి.
డి కాక్ మరో శతకం...
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చెలరేగడంతో తొలి ఓవర్ మినహా ఆ తర్వాత జట్టు రన్‌రేట్ 6.52కు తగ్గలేదు. సిరీస్‌లో ఫామ్‌లో లేని ఆమ్లా (13 బంతుల్లో 23; 5 ఫోర్లు) మోహిత్ ఓవర్లో 3 ఫోర్లు బాదినా... వన్డేల్లో 6 వేల పరుగుల మైలురాయి దాటాక అదే ఓవర్లో వెనుదిరిగాడు. మరోవైపు డి కాక్ మరోసారి భారత్‌పై తన ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. ముఖ్యంగా పేసర్లు భువీ, మోహిత్‌లపై అతను ఎదురుదాడికి దిగి వేగంగా పరుగులు రాబట్టడంతో పవర్ ప్లేలో జట్టు స్కోరు 73 పరుగులకు చేరింది.
ఏడో ఓవర్లోనే స్పిన్నర్లను బరిలోకి దించినా లాభం లేకపోయింది. 58 పరుగుల వద్ద మిశ్రా బౌలింగ్‌లో డి కాక్ ఇచ్చిన క్యాచ్‌ను మోహిత్ వదిలేశాడు. ఈ క్రమంలో 78 బంతుల్లోనే అతను సిరీస్‌లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు రైనా బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి డి కాక్ అవుట్ కావడంతో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది.
బాదుడే బాదుడు...
డి కాక్ వికెట్ తీసిన ఆనందం భారత్‌కు ఎక్కువసేపు నిలవలేదు. ఈ దశలో జత కట్టిన డు ప్లెసిస్, డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఏ బౌలర్‌నూ వదిలి పెట్టకుండా వీరిద్దరు ఒకరితో ఒకరు పోటీ పడి చితక్కొట్టారు. 85 పరుగుల వద్ద మిశ్రా క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన ప్లెసిస్ ఆ తర్వాత 105 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు కండరాలు పట్టేయడంతో డు ప్లెసిస్ రిటైర్డ్‌హర్ట్‌గా తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు నుంచి డివిలియర్స్ తనదైన శైలిలో పండగ చేసుకున్నాడు.
బ్యాటింగ్ చేయడం ఇంత సులువా అన్నట్లుగా... 11 భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన అతను 57 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అనంతరం మూడో బంతిని ఆడబోయి డివిలియర్స్, ధోనికి క్యాచ్ ఇవ్వడంతో ఈ జోరు ఆగింది. ఆ తర్వాత చివర్లో మిల్లర్ (12 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు), బెహర్దీన్ (10 బంతుల్లో 16; 2 సిక్సర్లు) తలో చేయి వేసి దక్షిణాఫ్రికా స్కోరును 400 దాటించారు. చివరి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా రికార్డు స్థాయిలో 144 పరుగులు చేసింది.
కీలక భాగస్వామ్యం...
రికార్డు విజయలక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించలేదు. రోహిత్ శర్మ (16), విరాట్ కోహ్లి (7) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. అయితే ధావన్, రహానే కలిసి దూకుడుగా ఆడారు. ధావన్ చాలా రోజుల తర్వాత ఆత్మవిశ్వాసంతో ఆడగా, రహానే అనూహ్యంగా తన శైలికి భిన్నంగా సొంతగడ్డపై భారీ షాట్లతో చెలరేగాడు. 27 పరుగుల వద్ద మిల్లర్ సునాయాస క్యాచ్ వదిలేయడం కూడా ధావన్‌కు కలిసొచ్చింది. ఈ క్రమంలో 51 బంతుల్లో ధావన్, 41 బంతుల్లో రహానే అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
ఈ జోడి కేవలం 14.5 ఓవర్లలో 112 పరుగులు జోడించింది. అయితే ఈ దశలో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన రబడ భారత్‌కు దెబ్బ తీశాడు. తన వరుస ఓవర్లలో అతను ధావన్, రైనా (12)లను అవుట్ చేశాడు. మరోవైపు దూకుడుగా ఆడుతున్న రహానేను స్టెయిన్ చక్కటి బంతితో బోల్తా కొట్టించడంతో భారత్ జోరుకు కళ్లెం పడింది. ఆ తర్వాత ధోని (29 బంతుల్లో 27; 3 ఫోర్లు) క్రీజ్‌లో కొద్దిసేపు నిలబడ్డా లాభం లేకపోయింది. 14 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ ఇన్నింగ్స్ ముగియడం విశేషం. పరుగుల పరంగా స్వదేశంలో భారత్‌కిదే పెద్ద ఓటమి.
భువనేశ్వర్ రికార్డు
దక్షిణాఫ్రికా జట్టులో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు బాదగా, మన బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లలో 106 పరుగులిచ్చిన అతను వినయ్ కుమార్ (9 ఓవర్లలో 102)ను అధిగమించి భారత్ తరఫున కొత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా మిక్ లూయీస్ (113) తర్వాత ఇది రెండో అతి చెత్త ప్రదర్శన. ఈ మ్యాచ్‌లో భువీ బౌలింగ్‌లో ఏకంగా 12 ఫోర్లు, 6 సిక్స్‌లు రాగా, మోహిత్ బౌలింగ్‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు వచ్చాయి.
ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం ఇది రెండో సారి. ఇదే ఏడాది వెస్టిండీస్‌పై డివిలియర్స్, ఆమ్లా, రోసో ఆ ఘనత సాధించారు.
వన్డేల్లో ఇది సంయుక్తంగా మూడో అత్యధిక స్కోరు. టాప్-5లో మూడు దక్షిణాఫ్రికావే. భారత గడ్డపైనే కాకుండా భారత్‌పై కూడా ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. గతంలో భారత్, వెస్టిండీస్‌పై ఇండోర్‌లో 418 పరుగులు చేయగా... శ్రీలంక, భారత్‌పై రాజ్‌కోట్‌లో 411 పరుగులు చేసింది.
దక్షిణాఫ్రికా 400కు పైగా పరుగులు చేయడం ఇది ఆరోసారి. భారత్ ఐదు సార్లు చేసింది.
వన్డేల్లో 6 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు ఆమ్లా ఆడిన ఇన్నింగ్స్‌ల సంఖ్య 123.ఈ క్రమంలో కోహ్లి (136) రికార్డును సవరించాడు.
ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా సిక్స్‌ల సంఖ్య 20. అత్యధిక సిక్సర్ల (22) రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉంది.
డి కాక్‌కు భారత్‌పై ఇది ఐదో సెంచరీ, 9 ఇన్నింగ్స్‌లలోనే అతను ఈ శతకాలు చేశాడు.
డివిలియర్స్‌కు ఇది 23వ సెంచరీ. ఇవన్నీ 100కు పైగా స్ట్రయిక్ రేట్‌తోనే సాధించిన ఘనత అతని సొంతం.
భారత్ తరఫున ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్‌గా, ఓవరాల్‌గా రెండో బౌలర్‌గా భువనేశ్వర్ నిలిచాడు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డి కాక్ (సి) కోహ్లి (బి) రైనా 109; ఆమ్లా (సి) ధోని (బి) మోహిత్ 23; డు ప్లెసిస్ (రిటైర్డ్‌హర్ట్) 133; డివిలియర్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 119; మిల్లర్ (నాటౌట్) 22; బెహర్దీన్ (సి) రైనా (బి) హర్భజన్ 16; ఎల్గర్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 438.
వికెట్ల పతనం: 1-33; 2-187; 2-351 (రిటైర్డ్‌హర్ట్); 3-398; 4-430.
బౌలింగ్: భువనేశ్వర్ 10-0-106-1; మోహిత్ 7-0-84-1; హర్భజన్ 10-0-70-1; అక్షర్ 8-0-65-0; మిశ్రా 10-0-78-0; రైనా 3-0-19-1; కోహ్లి 2-0-14-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) తాహిర్ (బి) అబాట్ 16; ధావన్ (సి) ఆమ్లా (బి) రబడ 60; కోహ్లి (సి) డి కాక్ (బి) రబడ 7; రహానే (సి) బెహర్దీన్ (బి) స్టెయిన్ 87; రైనా (బి) రబడ 12; ధోని (బి) తాహిర్ 27; అక్షర్ (సి) మిల్లర్ (బి) స్టెయిన్ 5; హర్భజన్ (సి) (సబ్) మోరిస్ (బి) స్టెయిన్ 0; భువనేశ్వర్ (సి) మిల్లర్ (బి) తాహిర్ 1; మిశ్రా (ఎల్బీ) (బి) రబడ 4; మోహిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (36 ఓవర్లలో ఆలౌట్) 224.
వికెట్ల పతనం: 1-22; 2-44; 3-156; 4-172; 5-185; 6-195; 7-201; 8-210; 9-219; 10-224
బౌలింగ్: స్టెయిన్ 7-0-38-3; రబడ 7-0-41-4; అబాట్ 7-0-39-1; బెహర్దీన్ 8-0-55-0; తాహిర్ 7-1-50-2.