వన్డే సిరీస్ దక్షిణాఫ్రికాదే
ముంబై: టీమిండియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్ ను దక్షిణాఫ్రికా చేజిక్కించుకుంది. ముంబైలోని వాంఖేడ్ స్టేడియంలో సెంచరీల మోతతో అదరగొట్టిన దక్షిణాఫ్రికా సగర్వంగా ట్రోఫీని అందుకుంది. ఆదివారం జరిగిన చివరి డే అండ్ నైట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా 214 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. దీంతో వన్డే సిరీస్ ను దక్షిణాఫ్రికా 3-2 తో కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుని 439 పరుగుల లక్ష్యాన్ని టీమిండియాకు నిర్దేశించింది.
భారీ పరుగుల లక్ష్యాన్ని చేరే క్రమంలో టీమిండియా 36 ఓవర్లలో 224 పరుగులకే చాపచుట్టేసింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధవన్(60), అజింక్యా రహానే(87) లు మినహా ఎవరూ ఆకట్టుకోలేదు. రోహిత్ శర్మ(16), విరాట్ కోహ్లి(7), సురేష్ రైనా(12), మహేంద్ర సింగ్ ధోని (27 ), అక్షర్ పటేల్ (5) లు స్వల్ప పరుగులకే పెవిలియన్ కు చేరడంతో టీమిండియాకు ఘోర పరాభవం తప్పలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబడా నాలుగు వికెట్లు సాధించగా, స్టెయిన్ కు మూడు, ఇమ్రాన్ తాహీర్ లకు రెండు వికెట్లు లభించాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా పరుగుల మోత మోగించింది. ఓపెనర్ డీ కాక్, డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లు దూకుడుగా ఆడి శతకాలతో పరుగుల వరద పారించారు. డీ కాక్(109; 87 బంతుల్లో 17 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్(133;115 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు), డివిలియర్స్(119;6 బంతుల్లో 3 ఫోర్లు, 11 సిక్సర్లు) సెంచరీల నమోదు చేశారు.
ఆదిలో మంచి టచ్ లో కనిపించిన ఓపెనర్ హషీమ్ ఆమ్లా (23) ను టీమిండియా తొందరగానే పెవిలియన్ కు పంపినా..ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. మరో ఓపెనర్ డీకాక్ తో కలిసి డు ప్లెసిస్ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ ధోని సేనపై ఎదురుదాడికి దిగి రెండో వికెట్ కు 154 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అనంతరం డీ కాక్ రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ సమయంలో బ్యాటింగ్ కు వచ్చిన ఏబీ డివిలియర్స్ తో డు ప్లెసిస్ జతకలిశాడు. వీరిద్దరూ కూడా ధోని సేనకు చుక్కలు చూపించారు. తొలుత డు ప్లెసిస్ సెంచరీ చేయగా, అనంతరం డివిలియర్స్ కూడా సెంచరీ మార్కును చేరాడు.
ఈ జోడి 164 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా 44 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 351పరుగులు చేసింది. కాగా, ఆ సమయంలో డు ప్లెసిస్ కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరాడు. అటు తరువాత దక్షిణాఫ్రికా మరో 47 పరుగులు చేశాక డివిలియర్స్ మూడో వికెట్ రూపంలో అవుటయ్యాడు. చివర్లో బెహర్దియన్(22 నాటౌట్) బ్యాట్ ఝుళిపించడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 438 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును లభించగా, డీ కాక్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈరోజు మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు నమోదు చేసి మరోసారి తన బ్యాటింగ్ లో సత్తా చూపెట్టింది. ఈ ఏడాది జనవరిలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఒకే ఇన్నింగ్స్ లో మూడు సెంచరీలు నమోదు చేయగా.. మరోసారి టీమిండియాపై అదే రికార్డును సాధించింది. డీకాక్, డు ప్లెసిస్, ఏబీ డివిలియర్స్ లో శతకాలతో మెరిసి జట్టుకు భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు. దాంతో పాటు టీమిండియా భారీ పరుగులను సమర్పించుకుని చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇప్పటివరకూ టీమిండియా వన్డేల్లో సమర్పించుకున్న అత్యధిక పరుగుల రికార్డు ఇదే. అంతకుముందు టీమిండియాపై అత్యధిక పరుగుల రికార్డు శ్రీలంక (411/8) పేరిట ఉంది.