‘సాఫారీ’ సులువు కాదు! | south africa Tour is not easy for india team | Sakshi
Sakshi News home page

‘సాఫారీ’ సులువు కాదు!

Published Sat, Nov 30 2013 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

‘సాఫారీ’ సులువు కాదు!

‘సాఫారీ’ సులువు కాదు!

మందకొడి పిచ్‌లు, టన్నుల కొద్దీ పరుగులు, పేరుకే తప్ప వేగం లేని ఫాస్ట్ బౌలింగ్... గత కొద్ది రోజులుగా భారత జట్టు ఆడిందే ఆటగా సాగింది. ఇకపై బౌన్సీ పిచ్‌లు, హడలెత్తించే పేస్, ప్రతీ బంతికి పోరాటం... రాబోయే రోజుల్లో టీమిండియాకు ఇలాంటి సవాళ్లు ఎదురు కానున్నాయి. పలు వివాదాలు, హెచ్చరికలు, షరతుల నడుమ ఎట్టకేలకు కుదించిన దక్షిణాఫ్రికా పర్యటనకు భారత్ సిద్ధమైంది. సఫారీ గడ్డపై టెస్టుల్లో భారత్ గత రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. మొత్తం ఐదుసార్లు అక్కడ పర్యటిస్తే మొదటి మూడుసార్లు రిక్తహస్తాలతోనే జట్టు వెనుదిరిగింది.
 
 అయితే భారత క్రికెట్ జట్టు ఉచ్ఛ దశలో నిలిచిన సమయంలో గత రెండు పర్యటనల్లో మాత్రం ఒక్కో విజయాన్ని నమోదు చేసింది. ఈసారి రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్న మన టీమ్ అంతకంటే మెరుగైన ప్రదర్శన ఇవ్వగలదా చూడాలి. సచిన్ లేకుండా మన జట్టు తొలిసారి పర్యటిస్తుండటం విశేషం. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాలో భారత్ 15 టెస్టులు ఆడింది. 2 టెస్టుల్లో గెలిచింది. 7 మ్యాచ్‌ల్లో ఓడింది. మిగతా 6 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. తాజా సిరీస్ నేపథ్యంలో గత టెస్టు సిరీస్ రికార్డులను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే...     
 - సాక్షి క్రీడా విభాగం
 
 2001 (2 టెస్టులు, 1 అనధికారిక టెస్టు)
 కెప్టెన్లు: గంగూలీ, పొలాక్   ఫలితం: 0-1తో భారత్ ఓటమి  మ్యాన్ ఆఫ్ ది సిరీస్: గిబ్స్
 విశేషాలు: సచిన్, తన కెరీర్ తొలి టెస్టులోనే వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీలు చేసినా బ్లూమ్‌ఫౌంటీన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ 9 వికెట్లతో ఓడింది. రెండో టెస్టు సాధారణ డ్రాగా ముగిసింది. అయితే ఈ టెస్టులో బాల్ టాంపరింగ్ వివాదం చెలరేగింది. ఆరుగురు భారత ఆటగాళ్లు టాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ మైక్ డెన్నిస్ నిషేధం విధించడం సంచలనం రేపింది. దాంతో మూడో టెస్టు జరిగినా... అనంతరం ఐసీసీ దానిని రద్దు చేస్తూ అనధికారిక టెస్టుగా గుర్తింపు ఇచ్చింది. సెంచూరియన్‌లో జరిగిన ఈ మూడో టెస్టులోనూ భారత్ ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
 
 2006-07 (3 టెస్టులు)
 కెప్టెన్లు: ద్రవిడ్, స్మిత్  ఫలితం: 1-2 తో భారత్ ఓటమి   మ్యాన్ ఆఫ్ ది సిరీస్: పొలాక్
 విశేషాలు: ఎట్టకేలకు దక్షిణాఫ్రికా గడ్డపై భారత్‌కు తొలి విజయం అందించిన సిరీస్ ఇది. మొదటి టెస్టులో భారత్ 123 పరుగులతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. శ్రీశాంత్ (8/99) అద్భుత బౌలింగ్ టీమిండియాకు విజయాన్ని అందించింది. అయితే అదే జోరును కొనసాగించలేకపోయిన ద్రవిడ్ సేన తర్వాతి రెండు టెస్టుల్లో పరాజయం పాలైంది. డర్బన్‌లో ఎన్తిని (8/89) దెబ్బకు టీమిండియా 174 పరుగులతో ఓడగా... కేప్‌టౌన్‌లో 5 వికెట్ల తేడాతో తలవంచింది.
 
 2010-11 (3 టెస్టులు)
 కెప్టెన్లు: ధోని, స్మిత్   ఫలితం: 1-1తో డ్రా   మ్యాన్ ఆఫ్ ది సిరీస్: జాక్ కలిస్
 విశేషాలు: గత పర్యటన ప్రదర్శనతో పోలిస్తే టీమిండియా ఈసారి మరింత మెరుగైంది. నాలుగు సార్లు సిరీస్‌లను కోల్పోయిన జట్టు మొదటి సారి డ్రాతో ముగించగలిగింది. సచిన్ 50వ సెంచరీ చేసినా... కలిస్ (201 నాటౌట్) ప్రదర్శనతో తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 25 పరుగులతో ఓడింది. అయితే రెండో టెస్టులో అద్భుత విజయంతో కోలుకుంది. లక్ష్మణ్ (38, 96) ఆటతో 87 పరుగుల తేడాతో ఇండియా మ్యాచ్ నెగ్గింది. మూడో టెస్టులో ఇరు జట్లు సమ ఉజ్జీలుగా పోరాడటంతో ఫలితం తేలలేదు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో స్టెయిన్ విధ్వంసకర స్పెల్‌ను ఎదుర్కొని సచిన్ (146) చేసిన సెంచరీ చిరస్మరణీయం.
 
 1992-93 (4 టెస్టులు)
 కెప్టెన్లు: అజహరుద్దీన్, వెసెల్స్  ఫలితం: 0-1తో భారత్ ఓటమి   మ్యాన్ ఆఫ్ ది సిరీస్: డొనాల్డ్
 విశేషాలు: క్రికెట్ ప్రపంచంలో దక్షిణాఫ్రికా పునరాగమనం చేసిన తర్వాత సొంతగడ్డపై జరిగిన తొలి టెస్టు సిరీస్ ఇది. దాంతో అనేక వ్యక్తిగత మైలురాళ్లకు సిరీస్ వేదికగా నిలిచింది. పోర్ట్ ఎలిజబెత్‌లో జరిగిన మూడో టెస్టు మినహా భారత్ చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబర్చడంతో మూడు టెస్టులు డ్రాగా ముగిశాయి. మూడో టెస్టులో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. డొనాల్డ్ (12/139) చెలరేగి జట్టును గెలిపించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 27/5 ఉన్న దశలో బరిలోకి దిగి కపిల్‌దేవ్ (129) చేసిన వీరోచిత సెంచరీ భారత్‌ను కాపాడలేకపోయింది.
 
 1996-97 (3 టెస్టులు)
 కెప్టెన్లు: సచిన్, క్రానే  ఫలితం: 0-2తో భారత్ ఓటమి  మ్యాన్ ఆఫ్ ది సిరీస్: డొనాల్డ్
 విశేషాలు: దక్షిణాఫ్రికా వికెట్ల స్వభావం ఏమిటో భారత్‌కు రుచి చూపించిన సిరీస్ ఇది. గతంలో ఎన్నడూ ఆడని అత్యంత వేగవంతమైన, బౌన్సీ డర్బన్ పిచ్‌పై తొలి టెస్టులో 100... 66 పరుగులకే కుప్పకూలి భారత్ 328 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. రెండో టెస్టులోనూ ఫలితం మారలేదు. తొలి ఇన్నింగ్స్‌లో సచిన్ (169), అజహర్ (115) సెంచరీలు చేసినా జట్టు 282 పరుగులతో పరాజయం పాలైంది. జొహన్నెస్‌బర్గ్ లో మూడో టెస్టులో భారత్ విజయానికి చేరువగా వచ్చినా... వర్షంతో అంతరాయం కలగడంతో దక్షిణాఫ్రికా బయట పడింది. ద్రవిడ్ (148, 81) ఆకట్టుకున్నాడు.
 
 వన్డేలూ అంతే...
 మరోవైపు వన్డేల్లో దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ 3 ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడింది. 1992లో 2-5తో, 2006లో 0-4తో, 2010లో 2-3 తేడాతో ఓడింది. ఇతర జట్లు పాల్గొన్న రెండు టోర్నీలలో దక్షిణాఫ్రికాపై ఒక మ్యాచ్ మాత్రమే నెగ్గి 7 సార్లు పరాజయం పాలైంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement