
ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన దక్షిణ కొరియా ఆటగాళ్లపై అభిమానులు గుడ్లతో ...
సియోల్ : ఫిఫా ప్రపంచకప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన దక్షిణ కొరియా ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం స్వదేశం చేరుకున్న ఆటగాళ్లకు తొలుత అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించినా ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఫొటోసెషన్ కోసం సిద్దమైన ఆటగాళ్లపై అభిమానులు గుడ్లు, దిండ్లతో దాడి చేశారు. కనీసం నాకౌట్‌కు కూడా చేరని ఆటగాళ్లకు ఫొటోసెషన్ ఎందుకని మీడియా సిబ్బందిని సైతం అడ్డుకున్నారు. అయితే ఢిఫెండింగ్ చాంపియన్, ఫుట్‌బాల్ ప్రపంచంలో జగజ్జేత అయిన జర్మనీని ఓడించి దక్షిణ కొరియా పెను సంచలనం నమోదు చేసిన విషయం తెలిసిందే. పోరాడితే పోయేదేమీ లేని స్థితిలో... కొరియా పోతూపోతూ డిఫెండింగ్ చాంపియన్‌నూ తనతో పట్టుకుపోయింది.
కనీసం ఈ గెలుపుతోనైనా అభిమానులు సంతోషిస్తారని భావించిన కొరియా ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. గ్రూప్ దశలో నిష్క్రమించి జూన్‌లోనే స్వదేశం చేరుతామనుకోలేదని జట్టు మేనేజర్ షిన్ ఆవేదన చెందారు. నాకౌట్‌కు చేరి జూలై ఆసాంతం ఆడుతామని భావించామని, కానీ అలా జరగలేదన్నారు. అభిమానుల మద్దతుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ...క్షమాపణలు కూడా తెలియజేశారు. అభిమానులకిచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయామని, కానీ జర్మనీపై గెలవడంతో వారు కొంత సంతోషపడ్డారని భావిస్తున్నామని తెలిపారు. అయితే అభిమానులు విసిరిని గుడ్లు షిన్‌కు సమీపంలో పడటం గమనార్హం.