
సూపర్ క్యాచ్.. మ్యాచ్ కే హైలెట్..!
పుణే: ఐపీఎల్-8లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్ తో ఆకట్టుకున్నారు. వికెట్ కీపర్ సంజూ శామ్సన్ కీలక ఆటగాళ్లు మురళీ విజయ్, వృద్ధిమాన్ సాహాలను రనౌట్లు చేసి పెవిలియన్ పంపాడు. టిమ్ సౌతీ పట్టిన సూపర్ క్యాచ్ లు సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాయి.
మ్యాచ్ చివర్లో కరుణ్ నాయర్ సహాయంతో సౌతీ పట్టిన సూపర్ క్యాచ్ మ్యాచ్ కే హైలెట్ గా నిలిచింది. జేమ్స్ ఫాల్కనర్ బౌలింగ్ లో పంజాబ్ కెప్టెన్ జార్జ్ బెయిలీ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో ఒడిసిపట్టాడు. తనను నియంత్రించుకోలేక బౌండరీ లైన్ దాటాడు. ఈ క్రమంలోనే తన చేతిలోని బంతిని బయటికి విసిరాడు. సౌతీ వెనుకే పరుగెత్తికొచ్చి బౌండరీ లోపల ఉన్న నాయర్ దాన్ని ఒడుపుగా అందిపుచ్చుకున్నాడు.
ఈ విన్యాసం చూసిన వారందరూ ఔరా అంటూ ఆశ్చర్యానికి లోనయ్యారు. బెయిలీ నిరాశగా పెవిలియన్ చేరాడు. రేర్ ఫీట్ చేసిన సౌతీ, కరణ్ సంయుక్తంగా హాట్ స్టార్ అవార్డు అందుకున్నారు.