హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో రాణించే విధంగా తీర్చిదిద్దేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ‘శాట్స్’ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం ఎల్బీ స్టేడియంలో పరిశ్రమల శాఖ కార్పొరేషన్ చైర్మన్ బాలమల్లు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
∙గత పాలకుల నిర్లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలు అభివృద్ధికి నోచుకోలేదు. నేను శాట్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత క్రీడల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నాను.
రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవలేదు. అయితే వారికి సరైన సదుపాయాలు కల్పిస్తే వారు జాతీయస్థాయిలో మరింతగా రాణిస్తారు. క్రీడలకు నిధుల కొరత ఉన్నమాట వాస్తవమే. నిధులను సమకూర్చేందుకు నా వంతు కృషి చేస్తున్నాను.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామకాలలో 2 శాతం స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ తీసుకువచ్చేందుకై రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించాను. అదే విధంగా ప్రతి జిల్లాలో క్రీడా అకాడమీ ఏర్పాటు, నూతన కోచ్‌ల నియామకం వంటి ప్రతిపాదనలు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాను.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రీజినల్ సెంటర్‌ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్‌కు వినతి పత్రం ఇచ్చాను.
లక్ష్మీబాయ్ జాతీయ వ్యాయామ విద్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పేందుకు... గచ్చిబౌలి స్టేడియంలోని సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ పునర్నిర్మాణం చేయుటకు కృషి చేస్తున్నాను.
క్రీడల అభివృద్ధికై తమతో పాటు క్రీడాశాఖ అధికారులు సైతం కలిసి వస్తే రాష్ట్రంలో క్రీడాకారులకు మరింత మేలు చేకూరుతుంది.
టోక్యో ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌ను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం విశిష్ట క్రీడాకారులకు అందజేసే టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో మన రాష్ట్రం నుంచి 15 మంది క్రీడాకారులకు చోటు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాను.
Comments
Please login to add a commentAdd a comment