
క్రీడా భారత్‌గా మారుస్తాం
దేశంలో క్రీడల అభివృద్ధిపై కేంద్ర క్రీడా శాఖ దృష్టి సారించింది. దీంట్లో భాగంగా గ్రామీణ, పట్టణ క్రీడా మౌలిక సౌకర్యాలను మరింతగా మెరుగుపరిచేందుకు పలు పథకాలను అమలుపరుచనుంది.
క్రీడల మంత్రి సోనోవాల్
గువాహటి: దేశంలో క్రీడల అభివృద్ధిపై కేంద్ర క్రీడా శాఖ దృష్టి సారించింది. దీంట్లో భాగంగా గ్రామీణ, పట్టణ క్రీడా మౌలిక సౌకర్యాలను మరింతగా మెరుగుపరిచేందుకు పలు పథకాలను అమలుపరుచనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత క్రీడలవైపు ఆకర్షితులయ్యేలా చూడడమే తమ ముఖ్య ఉద్దేశమని క్రీడా మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. ‘మనిషి జీవితంలో క్రీడలు కూడా భాగం కావాలి. దేశంలోని యువతకు ఇది సహాయకంగా ఉండడమే కాకుండా శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండగలుగుతారు.
ఈ ఉద్దేశంతోనే రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ కింద దేశంలోని ప్రతీ బ్లాకులో రూ. కోటి 60 లక్షలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించాం. దీంట్లో క్రీడా పరికరాల కోసం ఒక్కో బ్లాక్‌కు రూ.15 లక్షలు ఇవ్వనున్నాం’ అని మంత్రి సోనోవాల్ వివరించారు. అలాగే ఈ నెల 8 నుంచి 12 వరకు గువాహటిలో జాతీయ యూత్ ఫెస్టివల్ జరుగుతుందని... ఇందులో మేరీకోమ్, వీరేంద్ర సెహ్వాగ్, సుశీల్ కుమార్ పాల్గొంటారని చెప్పారు.