సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి తగిన ప్రోత్సాహం అందిస్తామని, ప్రతిభగల క్రీడాకారులకే పెద్దపీట వేస్తామని తెలంగాణ రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన శుక్రవారం లాల్‌బహదూర్ (ఎల్బీ) స్టేడియాన్ని సందర్శించారు. స్టేడియం స్థితిగతులు, మౌలిక వసతులు, క్రీడా ప్రాంగణాలను పరిశీలించారు. అనంతరం శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్ బాబు, రాష్ట్ర క్రీడల కార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి శాట్స్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎందరో క్రీడాకారులను అందించిన ఎల్బీ స్టేడియాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారుల ఎంపికలో పైరవీలకు చోటు లేదని, ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోన్న టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ను కలిసి ఆమెను ప్రత్యేకంగా అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment