శ్రీలంక క్రికెటర్ పై నాలుగేళ్ల నిషేధం
కొలొంబో: అథ్లెటిక్స్ ప్రపంచాన్ని ఎక్కువగా డోపింగ్ ఉదంతాలు కుదిపేసిన వార్తలను తరుచు వింటుంటాం. అయితే అంతర్జ్తాతీయ స్థాయి క్రికెటర్ డోపింగ్ లో పట్టుబడి నాలుగేళ్ల పాటు నిషేధానికి గురైన ఘటన తాజాగా శ్రీలంక క్రికెట్ లో కలకలం సృష్టించింది. శ్రీలంక జాతీయ క్రికెటర్ కుశాల్ పెరీరా డోపింగ్ కు పాల్పడినట్లు తాజాగా రుజువు కావడంతో అతనిపై నాలుగేళ్ల నిషేధం పడింది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ఖతర్ లో నిర్వహించిన డోపింగ్ టెస్టులో అతని యూరిన్ శాంపిల్స్ పాజిటివ్ గా వచ్చాయి.
ఈ విషయాన్ని ఐసీసీ తమ దృష్టికి తీసుకొచ్చినట్లు శ్రీలంక క్రీడాశాఖా మంత్రి దయసిరి జయశేఖర తెలిపారు. కుశల్ పెరీరా నిషేధిత ద్రవ పదార్థాన్ని తీసుకున్నట్లు అతనికి నిర్వహించిన డోపింగ్ టెస్టు శాంపిల్స్ లో బహిర్గతమైనట్లు పేర్కొన్నారు. కాగా, దీనిపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని దయసిరి జయశేఖర్ పేర్కొన్నారు. ఇలా శ్రీలంక క్రికెట్ లో డోపింగ్ టెస్టులో పట్టుబడిన రెండో క్రికెటర్ పెరీరా. అంతకుముందు 2011లో ఉపల్ తరంగా ఈ తరహాలోనే పట్టుబడి మూడు నెలలు బహిష్కరణకు గురయ్యాడు.