సింగమలింగై | Sri Lanka's Malinga to quit ODIs after first Bangladesh match | Sakshi
Sakshi News home page

సింగమలింగై

Published Fri, Jul 26 2019 5:06 AM | Last Updated on Fri, Jul 26 2019 5:06 AM

Sri Lanka's Malinga to quit ODIs after first Bangladesh match - Sakshi

ఇటీవలి వన్డే ప్రపంచ కప్‌లో స్టార్క్, బుమ్రా, బౌల్ట్‌లు యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌పై విరుచుకుపడ్డారు. కానీ ఫలితం వద్దకు వచ్చేసరికి మాత్రం యార్కర్లకు ‘తాత’లాంటివాడే అగ్రస్థానంలో నిలిచాడు. అవును, ఈ మెగా టోర్నీలో యార్కర్ల ద్వారా ఎక్కువ (ఐదు) వికెట్లు తీసిన బౌలర్‌ 38 ఏళ్ల లసిత్‌ మలింగ. ఎక్కడా తగ్గని వేగం, కొంచెం కూడా అటూ ఇటూ కాకుండా ‘బ్లాక్‌హోల్‌’లో బంతిని విసరగల కచ్చితత్వం, తనకే సాధ్యమైన ప్రత్యేక యాక్షన్‌తో కలిసొచ్చే అదనపు ప్రయోజనంతో మలింగ యార్కర్లు బ్యాట్స్‌మెన్‌ను ప్రమాద స్థితిలోకి పడేశాయి. ఇప్పుడు ఈ యార్కర్లకు వన్డే వేదికపై విశ్రాంతినిచ్చే సమయం వచ్చింది. బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌ తర్వాత వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు మలింగ ప్రకటించడంతో ఒక అధ్యాయం ముగుస్తున్నట్లయింది.   

సాక్షి క్రీడా విభాగం
‘శుక్రవారం నేను ఆఖరి వన్డే ఆడబోతున్నాను. మీకు వీలైతే వచ్చి మ్యాచ్‌ చూడండి’... అంటూ లసిత్‌ మలింగ తన అభిమానులను ప్రేమదాస స్టేడియానికి ఆహ్వానించాడు. వన్డేల్లో శ్రీలంక తరఫున మురళీధరన్‌ (523 వికెట్లు), చమిందా వాస్‌ (399 వికెట్లు) తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మలింగ తన కెరీర్‌ను ముగించబోతున్నాడు. బంగ్లాదేశ్‌తో సిరీస్‌ మొత్తానికి అతడిని ఎంపిక చేసినా ఒక్క వన్డేకే పరిమితం కావాలని నిర్ణయించుకున్నాడు. నిజానికి వరల్డ్‌కప్‌తోనే రిటైర్‌ అవుతాడని అంతా భావించినా... 13 వికెట్లతో అతను లంక జట్టు టాపర్‌గా నిలవడంతో సెలక్టర్లు కొనసాగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. టి20 క్రికెట్‌లో మాత్రం కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు మలింగ చెప్పాడు.   

టెస్టులతో మొదలు...
బౌలర్‌ వేస్తున్న బంతి అర్థం కాక అంపైర్ల టై, ప్యాంట్‌లు మార్చమని ఆటగాళ్లు అడిగే పరిస్థితి మైదానంలో తలెత్తిందంటే అందుకు మలింగనే కారణం! 2005లో స్వదేశంలో లంకతో జరిగిన టెస్టులో న్యూజిలాండ్‌కు ఈ సమస్య ఎదురైంది. మలింగకే సొంతమైన ‘రౌండ్‌ ఆర్మ్‌ యాక్షన్‌’లో బంతి మరీ కిందనుంచి వస్తుంది. అది అంపైర్ల దుస్తుల్లో కలిసిపోయి బ్యాట్స్‌మెన్‌కు కనిపించకపోయేది.  దాంతో వారు ఒకసారి టై రంగు మార్చమని, రెండోసారి ప్యాంట్‌లనే మార్చమని కూడా కోరారు. ఈ టెస్టులో మలింగ తీసిన 9 వికెట్లలో 7 బౌల్డ్‌ లేదా ఎల్బీ కావడం విశేషం. అప్పుడే తొలిసారిగా ప్రపంచ క్రికెట్‌ దృష్టి మలింగపై పడింది. అతని ఇన్‌స్వింగింగ్‌ యార్కర్లు, స్లో బాల్, బౌన్సర్లు ప్రమాదకరంగా మారి బ్యాట్స్‌మెన్‌ను వణికించాయి. గాయాలతో టెస్టు కెరీర్‌ 30 మ్యాచ్‌లకే పరిమితం కాగా, అతనిలోని అసలు ప్రతిభ వన్డే క్రికెట్‌లో పదునెక్కింది.  

ఒంటి చేత్తో...
సరిగ్గా 15 ఏళ్ల క్రితం తొలి వన్డే ఆడిన మలింగ వచ్చీ రాగానే అద్భుతాలేమీ చేయలేదు. అయితే 2006లో లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత బౌలింగ్‌తో జట్టును గెలిపించడంతో అతని సత్తా అందరికీ తెలిసింది. 2007 ప్రపంచ కప్‌ నుంచి 2015 ప్రపంచ కప్‌ వరకు శ్రీలంక జట్టు నిలకడగా సాధించిన విజయాల్లో బౌలర్‌గా మలింగదే కీలక పాత్ర. సంగక్కర, జయవర్ధనేవంటి దిగ్గజాలతో పాటు దిల్షాన్‌ ఎక్కువ భాగం బ్యాటింగ్‌ భారం మోయగా... మ్యాచ్‌ ఆరంభంలోనే మలింగ అందించిన వికెట్లు లంక విజయానికి బాటలు వేసేవి. మలింగ వన్డే ప్రదర్శన అనగానే అందరికీ గుర్తొచ్చేది 2007 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌.

ఇందులో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ‘హ్యాట్రిక్‌ ప్లస్‌’ నమోదు చేసిన అతను క్రికెట్‌ ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సాధించాడు. 2007, 2011 రెండు ప్రపంచ కప్‌ ఫైనల్‌లు కూడా ఆడి ఓటమి పక్షానే నిలిచిన మలింగ 2015 వరల్డ్‌ కప్‌కు వచ్చేసరికి ఫిట్‌నెస్‌ కోల్పోయి రాణించలేకపోయాడు. ఆ తర్వాతా కొనసాగిన ఫిట్‌నెస్‌ సమస్యలు, బోర్డుతో వివాదం నేపథ్యంలో చాలా రోజుల క్రితమే మలింగ కెరీర్‌ ముగిసినట్లే అనిపిం చింది. అయితే లంక జట్టులో అనుభవలేమి, వరుస వైఫల్యాల తర్వాత సీనియర్‌ మార్గనిర్దేశనం అవసరమై అతను మరో ప్రపంచ కప్‌ వరకు తన ప్రస్థానాన్ని కొనసాగించగలిగాడు. కెప్టెన్‌గా శ్రీలంకకు 2014 టి20 ప్రపంచ కప్‌ను అందించిన ‘స్లింగ’పొట్టి ఫార్మాట్‌లో కూడా ఎంత కాలం ఆడగలడో చూడాలి.  

‘రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం. చాలా సంతోషంగా నిష్క్రమిస్తున్నా. కుర్రాళ్లకు ఇది చక్కని అవకాశంగా భావిస్తున్నా. నా వీడ్కోలుపై రెండేళ్లక్రితం సెలక్టర్లకు సమాచారమిచ్చాను. ఈ ప్రపంచకప్‌ కోసమే కష్టపడ్డాను. వన్డేలకు గుడ్‌బై చెబుతున్నప్పటికీ పొట్టి ఫార్మాట్‌లో కొనసాగుతాను. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌ దాకా క్రికెట్‌ ఆడతా’   
– మలింగ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement