జకార్తాలో శ్రీకాంతులు... | Srikanth beats Sakai to win Indonesia Open Super Series Premier title | Sakshi
Sakshi News home page

జకార్తాలో శ్రీకాంతులు...

Published Mon, Jun 19 2017 3:27 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

జకార్తాలో శ్రీకాంతులు...

జకార్తాలో శ్రీకాంతులు...

ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీ విజేత శ్రీకాంత్‌
ఫైనల్లో 47వ ర్యాంకర్‌ సకాయ్‌పై విజయం
పురుషుల సింగిల్స్‌లో ఈ టైటిల్‌ నెగ్గిన తొలి భారతీయుడు
కెరీర్‌లో మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌
రూ. 48 లక్షల 33 వేల ప్రైజ్‌మనీ సొంతం


 అంతర్జాతీయ వేదికపై మన రాకెట్‌ మళ్లీ మెరిసింది. ఈ సీజన్‌లో వరుసగా రెండోసారి భారత క్రీడాకారుడి ఖాతాలో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ చేరింది. గత ఏప్రిల్‌లో సాయిప్రణీత్‌ సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ నెగ్గగా... అదే టోర్నీ ఫైనల్లో సాయిప్రణీత్‌ చేతిలో ఓడిన కిడాంబి శ్రీకాంత్‌... తాజాగా ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీలో చాంపియన్‌గా అవతరించి భారత క్రీడాభిమానుల్ని ఆనందడోలికల్లో ముంచాడు.  

జకార్తా (ఇండోనేసియా): అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగినప్పటికీ... మ్యాచ్‌ మ్యాచ్‌కూ తన ఆటతీరును మెరుగుపర్చుకొని ఆడిన భారత బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ప్రతిష్టాత్మక ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా ఆవిర్భవించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ కేవలం 37 నిమిషాల్లోనే 21–11, 21–19తో ప్రపంచ 47వ ర్యాంకర్‌ కజుమాసా సకాయ్‌ (జపాన్‌)పై గెలిచాడు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 75 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 48 లక్షలు 33 వేలు)తోపాటు 11 వేల ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. మరోవైపు భారత బ్యాడ్మింటన్‌ సంఘం (బాయ్‌) శ్రీకాంత్‌కు రూ. 5 లక్షలు నజరానా ప్రకటించింది.

దూకుడే దూకుడు...
భారత్‌కే చెందిన ప్రణయ్‌తో జరిగిన సెమీస్‌లో ఐదు మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొని గెలిచి ఫైనల్‌కు చేరిన సకాయ్‌ను శ్రీకాంత్‌ తక్కువ అంచనా వేయలేదు. సకాయ్‌ ఆటతీరుపై మంచి హోంవర్క్‌ చేసి వచ్చిన శ్రీకాంత్‌ ఆద్యంతం దూకుడుగానే ఆడాడు. ర్యాలీలు సుదీర్ఘంగా సాగకుండా జాగ్రత్త పడ్డాడు. షటిల్స్‌ను నియంత్రిస్తూ ఆడిన శ్రీకాంత్‌ కొట్టిన పలు స్మాష్‌ షాట్‌లకు సకాయ్‌ వద్ద జవాబు లేకపోయింది. తొలి గేమ్‌ను కేవలం 13 నిమిషాల్లోనే ముగించిన ఈ తెలుగు తేజం రెండో గేమ్‌లో మాత్రం కాస్త ఒత్తిడికి లోనయ్యాడు. నెట్‌ గేమ్‌లో, ర్యాలీల్లో పరిణతి కనబరిచిన సకాయ్‌ ఒకదశలో 11–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. కానీ శ్రీకాంత్‌ సంయమనం కోల్పోలేదు. విరామం తర్వాత తన రాకెట్‌ జోరు పెంచిన శ్రీకాంత్‌ స్కోరును 13–13 వద్ద సమం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ పాయింట్‌ పాయింట్‌కూ పోరాడారు. స్కోరు 19–19 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్‌ వరుసగా రెండు పాయింట్లు గెలిచి తన కెరీర్‌లో మరో చిరస్మరణీయ విజయాన్ని దక్కించుకున్నాడు.

పురుషుల సింగిల్స్‌ విభాగంలో ఈ టోర్నీ టైటిల్‌ గెలిచిన తొలి భారతీయ క్రీడాకారుడు శ్రీకాంత్‌. ఓవరాల్‌గా భారత్‌ నుంచి రెండో ప్లేయర్‌. గతంలో సైనా మహిళల సింగిల్స్‌ విభాగంలో (2009, 2010, 2012లలో) మూడుసార్లు విజేతగా నిలిచింది.

ఓవరాల్‌గా శ్రీకాంత్‌ కెరీర్‌లో ఇది మూడో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌. 2014లో చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ టోర్నీలో, 2015 ఇండియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో శ్రీకాంత్‌ చాంపియన్‌గా నిలిచాడు.  

ప్రశంసల జల్లు...
ఇండోనేసియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన శ్రీకాంత్‌ను రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అభినందించారు. ‘శ్రీకాంత్‌ నీ విజయంపట్ల మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నాం’ అని మోదీ తన ట్విట్టర్‌ ఖాతాలో ప్రశంసించారు. ‘శ్రీకాంత్‌... హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ప్రణబ్‌ ముఖర్జీ... ‘నీ విజయంపట్ల అందరూ గర్వంగా ఉన్నారు’ అని అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా శ్రీకాంత్‌కు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో అతను మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఉత్సాహమిచ్చే విజయం...
నేను సూపర్‌ సిరీస్‌ టోర్నీ నెగ్గి రెండేళ్లు గడిచాయి. తాజా విజయం నాకెంతో అవసరం. గత ఏప్రిల్‌లో సింగపూర్‌ ఓపెన్‌ సిరీస్‌ ఫైనల్లో ఓడిన తర్వాత మరో టోర్నీలో ఫైనల్‌కు చేరడం ఆనందాన్ని చ్చింది. ఫైనల్లో దూకుడైన ఆటతీరు ఫలితాన్నిచ్చింది. వచ్చే వారం ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టోర్నీలో ఆడతాను. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు ఇదే చివరి టోర్నీ కావడంతో ఇండోనేసియా ఓపెన్‌ విజయం నా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ నా అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తాను. మున్ముందు మరిన్ని విజయాలు వస్తాయని నమ్మకంతో ఉన్నాను. నా హృదయంలో ఇండోనేసియాకు చెందిన కోచ్‌ ముల్యో హన్‌డోయోకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సహాయక కోచ్‌గా వచ్చాక నా ఆటతీరు మరింతగా మెరుగుపడింది. ఇండోనేసియాలో బ్యాడ్మింటన్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. ఇలాంటి వేదికపై విజేతగా నిలిచినందుకు చాలా ఆనందంగా ఉంది.
 –సాక్షితో కిడాంబి శ్రీకాంత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement